కాంగ్రెస్‌కు అఖిలేశ్ ఆఫర్!

5
- Advertisement -

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027 సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 200కు పైగా అసెంబ్లీ స్థానాలను కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాత్రం కాంగ్రెస్‌కు 60 నుంచి 70 స్థానాలు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని వందలోపు స్థానాలకే పరిమితం చేయాలని ఎస్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఆరు స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించిన స్థానాలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో ప్రధాన భాగస్వామిగా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు 60 నుంచి 70 స్థానాలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనను కాంగ్రెస్‌కు అధికారికంగా తెలియజేశారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

నవంబర్ 15లోగా సీట్ల పంపకాల చర్చలను పూర్తి చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులకు తమ నియోజకవర్గాల్లో ప్రచారం, ఎన్నికల సన్నద్ధతకు తగిన సమయం కల్పించాలన్నది ఆ పార్టీ ఉద్దేశం. కాంగ్రెస్ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Also Read:Delhi AQI..అప్‌డేట్

2027 యూపీ ఎన్నికల్లో బీజేపీకి….ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఆర్ఎల్డీ, అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీ, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీలు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది. సీట్ల పంపకాలపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -