కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తన కుమారుడు, ఫొటోగ్రాఫర్ రైహాన్ వాద్రాకు మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలకు సంబంధించిన ఫొటోలను తన వ్యక్తిగత ప్రదర్శన నుంచి తొలగించాలని నిర్వాహకులు కోరినట్లు రైహాన్ ఆరోపించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. నిజం కోసం నిలబడాలని తన కుమారుడిని చూసి ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటానని పేర్కొన్నారు.
కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాంక గాంధీ గురువారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో భావోద్వేగ పోస్టు చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తి మరొకరి భావవ్యక్తీకరణకు భయపడినప్పుడు.. తాను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న అధికారాన్ని అప్పటికే కోల్పోయాననే విషయాన్ని అతడు గుర్తించలేడు. నిన్ను చూసి గర్విస్తున్నాను. ఎప్పటికీ గర్విస్తూనే ఉంటాను అని ఆమె పేర్కొన్నారు.
Also Read:కివీస్‌తో టీమిండియా టీ20..బలాబలాలు ఇవే!
రైహాన్ వాద్రా ఫొటోగ్రాఫర్‌గా రూపొందించిన ‘నో ఐడియా ఈజ్ ఫైనల్’ (No Idea is Final) పేరుతో ఎగ్జిబిషన్ బుధవారం ప్రివ్యూతో ప్రారంభమైంది. గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రదర్శన ప్రారంభానికి కొన్ని గంటల ముందు, ఢిల్లీలో గత ఆరు నెలలుగా జరిగిన నిరసనలకు సంబంధించిన ఫొటోలను తొలగించాలని బికనీర్ హౌస్ నిర్వాహకులు కోరినట్లు రైహాన్ ఆరోపించారు.

