వేలాది మందికి ఉపాధి కల్పించాల్సిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ ప్రస్తుతం శిథిలాలుగా మారింది. ఒకప్పుడు పారిశ్రామిక అభివృద్ధికి కీలకంగా నిలిచిన ఈ పరిశ్రమ భవనాలను అధికారులు కూల్చివేయడంతో అక్కడి భారీ నిర్మాణాలు కనుమరుగయ్యాయి. పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తారనే ఆశలు పెట్టుకున్న స్థానికులకు ఈ పరిణామం నిరాశ కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే పరిశ్రమ ఈ దుస్థితికి చేరడానికి కారణమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. పరిశ్రమ పునరుద్ధరణ ద్వారా ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలను పెంచడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని భావించింది. అయితే ఈ ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు.
ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జోగు రామన్న కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కలిసి పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని కోరారు. పరిశ్రమ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమను పునఃప్రారంభించడంపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం, అక్కడి యంత్రాలు, ఇతర సామగ్రిని తుక్కుగా విక్రయించే దిశగా వ్యవహరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా పరిశ్రమ భవనాలను కూల్చివేయడంతో పునరుద్ధరణపై మిగిలిన ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి.
పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తే స్థానికులకు ఉద్యోగాలు లభించడంతో పాటు ఆదిలాబాద్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతం లభించేది. కానీ పరిశ్రమ భవనాలు నేలమట్టం కావడంతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:కివీస్‌తో టీమిండియా టీ20..బలాబలాలు ఇవే!

