ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జంతర్ మంతర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ తమ పోరాటంలో విజయం సాధించామని కార్యకర్తలు ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.
సీజేపీకి చెందిన సౌరవ్ దాస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘జంతర్ మంతర్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నాం. మేం అక్కడికి ప్రవేశించాం. ఇప్పుడు పోలీసులు మమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే, యువతకు మేం ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. మనం అనుకుంటే సాధించగలం’’ అని పేర్కొన్నారు.
మరో కార్యకర్త అశుతోష్ రంకా కూడా జంతర్ మంతర్‌లోకి ప్రవేశించినట్లు ప్రకటించారు. అక్కడ జాతీయ జెండాను చేతబట్టి ఉన్న ఫొటోను కార్యకర్త అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి రద్దు చేసిన నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల బారికేడ్లను దాటి నిరసన స్థలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, అజింక్య షిండేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జంతర్ మంతర్‌ను నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించడంపై అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. నిరసనలకు స్థలం లేకుండా చేసినంత మాత్రాన ప్రజల పోరాట స్ఫూర్తిని అణచివేయలేరని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు జంతర్ మంతర్‌కు బదులుగా ఢిల్లీలోని రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదాన్‌లను నిరసనలకు ప్రత్యామ్నాయ ప్రదేశాలుగా గుర్తించినట్లు సమాచారం.
Also Read:రొమాంటిక్ కామెడీ..’మైత్రీ ఇన్ లవ్’
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో పాటు, నిరసనలకు అనుమతి ఇవ్వాలని సీజేపీ కార్యకర్తలు కోరుతున్నారు. పోలీసుల చర్యలతో తమ ఉద్యమం ఆగిపోదని వారు స్పష్టం చేశారు.

