రొమాంటిక్ కామెడీ..’మైత్రీ ఇన్ లవ్’

0
- Advertisement -

భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘ఇరుముడి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రత్యేకమైన ముద్ర వేసింది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నేతృత్వంలోని ఈ ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ.. టాప్ స్టార్స్ తో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, బలమైన కథాంశాలతో రూపొందే చిన్న, మీడియం సినిమాలకు కూడా అండగా నిలుస్తోంది. జాతీయ అవార్డు అందుకున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఉప్పెన’తో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను జంటగా పరిచయం చేసిన ఈ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. #మైత్రీ ఇన్ లవ్ గా రూపొందుతున్న ఈ చిత్రంతో ఎన్నో ఏళ్లుగా సినిమా కలలు కంటూ, నేర్చుకుంటూ, తమ ప్రతిభను మెరుగుపరుచుకున్న కొత్తవారు సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం.. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండే విలక్షణమైన బంధాన్ని ప్రేమ, హాస్యం, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో అలరించనుంది. సహజమైన భావోద్వేగాలు, ఆసక్తికరమైన కథనంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జై జాస్తి, మేధ మేక జంటగా పరిచయం అవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై నిర్మాణ సంస్థ ఎంతో నమ్మకంతో ఉంది. ఈ కొత్త ప్రేమకథను వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

‘30 వెడ్స్ 21’, ‘మిడిల్ బెంచ్ రవి’ వంటి పాపులర్ వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ వనం ఈ సినిమాతో ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు మహేష్ బాబు పి ఈ సినిమాకు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన భాగస్వామ్యం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది.

సినిమా నిర్మాణంపై ఆసక్తితో ఫిల్మ్‌మేకింగ్, బిజినెస్ ఎకనామిక్స్‌లో విద్యను అభ్యసించిన జై జాస్తి.. ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. తన విద్యాభ్యాస సమయంలో సౌండ్, ఎడిటింగ్, స్క్రీన్‌రైటింగ్, థియేటర్ ఆర్ట్స్‌లో నైపుణ్యాన్ని సంపాదించారు. అనంతరం అనిల్ రావిపూడి దగ్గర ‘గాలి సంపత్’, ‘ఎఫ్3’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కొన్ని ఇండిపెండెంట్ చిత్రాల ద్వారా కూడా అనుభవం సంపాదించారు. ఇలా విభిన్నమైన క్రియేటివ్ రంగాల్లో అనుభవం పొందిన జై.. ఇప్పుడు హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.

ప్రముఖ హీరో శ్రీకాంత్ మేక, నటి ఊహ మేక కుమార్తె మేధ మేక మార్కెటింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈ సినిమాతో ఆమె నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. సినీ రంగంలోకి అడుగుపెడుతున్న మేధకు ఈ ప్రాజెక్ట్ కొత్త అధ్యాయంగా నిలవనుంది.

ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తనయుడు సాయి హర్ష ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. జై జాస్తి, మేధ మేక జంటను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రేమలోని ఆప్యాయత, సున్నితత్వం, మాధుర్యాన్ని అందంగా ఆవిష్కరిస్తోంది. జైను హత్తుకుని, అతని వంక ప్రేమగా చూస్తున్న మేధ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. కలర్‌ఫుల్ చెక్స్ షర్ట్, గడ్డంతో జై క్యాజువల్ లుక్‌లో ఉండగా, అందమైన చిరునవ్వుతో మేధ ఆకట్టుకుంటున్నారు. ఇద్దరి మధ్య సహజంగా కనిపించే కెమిస్ట్రీ పోస్టర్‌కు రొమాంటిక్ ఫీల్‌ను తీసుకొచ్చింది.

జై జాస్తి, మేధ మేక జంటగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. వారి మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ, ఫ్రెష్ అప్పీల్ ఈ జోడీపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీని ఫస్ట్ లుక్ కలిగిస్తోంది.

ఈ సినిమా ఈరోజు ఘనంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. యువ ప్రతిభతో రూపొందుతున్న ఈ చిత్ర ప్రయాణానికి ఈ వేడుక శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. సాహు గారపాటి, అర్చన కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నందిని రెడ్డి క్లాప్ కొట్టారు. సౌమ్య యెర్నేని తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.

సినిమాపై ఎన్నో ఏళ్లుగా కలలు కంటూ, నేర్చుకుంటూ, తమ ప్రతిభను మెరుగుపరుచుకున్న యువ ప్రతిభావంతులకు #మైత్రీ ఇన్ లవ్ ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలవనుంది. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ కొత్త ప్రేమకథపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. సినిమా టైటిల్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

నటీనటులు: జై జాస్తి, మేధ మేక

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: పృథ్వీ వనం
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
క్రియేటర్: మహేష్ బాబు పి
సహ నిర్మాత: అనిల్ యెర్నేని
సంగీతం: సాయి హర్ష
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

- Advertisement -