IPL:పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్

3
- Advertisement -

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌ (PBKS) కోచింగ్ బృందంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌ సహాయక సిబ్బందిలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు జేమ్స్ హోప్స్, బ్రాడ్ హాడిన్‌ తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. హోప్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా, హాడిన్ ఫీల్డింగ్ కోచ్‌గా పంజాబ్ కింగ్స్‌కు సేవలందించారు.

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత వీరిద్దరూ ఆస్ట్రేలియాలోని దేశవాళీ జట్లతో కొత్త బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. జేమ్స్ హోప్స్ క్వీన్స్‌లాండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. అలాగే బిగ్ బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు కూడా కోచింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. మరోవైపు బ్రాడ్ హాడిన్ న్యూ సౌత్ వేల్స్ పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. బీబీఎల్‌లోనూ ఆయనకు కోచింగ్ అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జేమ్స్ హోప్స్ 2024 చివర్లో రికీ పాంటింగ్‌తో కలిసి పంజాబ్ కింగ్స్ కోచింగ్ బృందంలో చేరారు. అంతకుముందు పాంటింగ్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌లోనూ పనిచేశారు. బ్రాడ్ హాడిన్ మాత్రం అంతకుముందు ట్రెవర్ బేలిస్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నారు. పాంటింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయనను కొనసాగించారు.

ఇప్పటికే పంజాబ్ కింగ్స్ నుంచి స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే కూడా వైదొలిగారు. ఐపీఎల్ 2026 తర్వాత ఆయన భారత జట్టులో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా చేరారు. దీంతో పంజాబ్ కింగ్స్‌కు ప్రస్తుతం కనీసం మూడు కీలక కోచింగ్ స్థానాలను భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read:UPI MDR వాయిదా..పేటీఎంషేర్ల పతనం

ఐపీఎల్ 2027 వేలానికి ముందే కొత్త కోచింగ్ సిబ్బందిని నియమించాలని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఒక భారతీయుడు, ఇద్దరు విదేశీ కోచ్‌లను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -