5G విస్తరణతో కొత్త దిశలో భారత్

1
- Advertisement -

భారత్ టెలికాం, డిజిటల్ కనెక్టివిటీ రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశం మరింత విస్తృతమైన 5G కనెక్టివిటీ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2026 పదో ఎడిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాల్లో టెలికాం రంగంలో చోటుచేసుకున్న మార్పులను ఆయన గుర్తుచేశారు. 2022లో ఇదే వేదికగా దేశంలో 5G సేవలు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత వాటి విస్తరణ వేగంగా కొనసాగిందని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.5 లక్షలకు పైగా 5G బేస్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్, గ్లోబల్ ప్రమాణాలు, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి అంశాలపై గత ఎడిషన్లలో చర్చించిన విషయాలను కూడా ప్రధాని ప్రస్తావించారు.

2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాధాన్యం మరింత స్పష్టమైందని మోదీ అన్నారు. డిజిటల్ కనెక్టివిటీ కారణంగానే విద్యార్థులు ఇంటి నుంచే చదువుకోగలిగారని, ప్రజలు పరస్పరం సంబంధాలు కొనసాగించగలిగారని, ఉద్యోగులు రిమోట్‌గా పనిచేయడం సాధ్యమైందని పేర్కొన్నారు.ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా ప్రజలకు చేరవేయడంలోనూ డిజిటల్ నెట్‌వర్క్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఉదాహరణగా పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రస్తావించారు. రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ అయినప్పుడు వారి మొబైల్ ఫోన్లకు వెంటనే సమాచారం అందుతోందని చెప్పారు.

స్మార్ట్‌ఫోన్లు కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్‌లకే పరిమితం కాకుండా ప్రజలకు వేగవంతమైన సేవలను అందుకునే సాధనాలుగా మారాయని మోదీ పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్ టవర్లను పెంచడంతో పాటు ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.మెరుగైన ఇంటర్నెట్, మొబైల్ కనెక్టివిటీతో భారత్‌లో గేమింగ్, కంటెంట్ క్రియేషన్ రంగాలు కూడా భారీగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రధాని అన్నారు. దేశంలో 50 కోట్ల మందికి పైగా ప్రజలు గేమింగ్ ఎకోసిస్టమ్‌లో భాగమయ్యారని చెప్పారు. ముఖ్యంగా చిన్న నగరాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో యువత ఈ రంగంలోకి వస్తున్నట్లు తెలిపారు.

యువత కేవలం గేమ్స్ ఆడటమే కాకుండా కంటెంట్ తయారు చేస్తూ, వ్యాపారాలను ప్రారంభిస్తూ, స్మార్ట్‌ఫోన్లను గేమింగ్ పరికరాలతో పాటు క్రియేటివ్ స్టూడియోలుగా ఉపయోగిస్తున్నారని మోదీ వివరించారు. దీంతో ప్రాంతీయ భాషల్లో వెబ్‌సిరీస్‌లు, సినిమాలకు కూడా డిమాండ్ పెరుగుతోందని చెప్పారు.

Also Read:UPI MDR వాయిదా..పేటీఎంషేర్ల పతనం

- Advertisement -