షింగిల్స్.. చాలామంది దీనిని కేవలం చర్మంపై వచ్చే దద్దుర్లు, నొప్పితో కూడిన వైరల్ సమస్యగా భావిస్తుంటారు. అయితే ఇది చర్మం, నరాలకే పరిమితం కాకపోవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షింగిల్స్ వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో గుండె, మెదడుకు సంబంధించిన రక్తనాళ సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
వరిసెల్లా జోస్టర్ వైరస్ వల్ల షింగిల్స్ ఏర్పడుతుంది. చిన్నతనంలో చికెన్‌పాక్స్ వచ్చిన తర్వాత ఈ వైరస్ శరీరంలోని నరాల్లో క్రియారహితంగా ఉండి.. కొన్ని పరిస్థితుల్లో మళ్లీ యాక్టివ్‌గా మారినప్పుడు షింగిల్స్ రావచ్చు. సాధారణంగా శరీరంలో ఒక వైపున తీవ్రమైన నొప్పి, మంట, దురదతో కూడిన బొబ్బలు, దద్దుర్లు కనిపిస్తాయి. కొందరిలో దద్దుర్లు తగ్గిపోయిన తర్వాత కూడా నరాల నొప్పి కొంతకాలం కొనసాగవచ్చు.
అయితే షింగిల్స్‌కు సంబంధించి ఇటీవలి అధ్యయనాలు మరింత ముఖ్యమైన అంశాన్ని వెలుగులోకి తెస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ తర్వాత స్ట్రోక్, గుండెపోటు వంటి రక్తనాళ సంబంధిత సమస్యల ప్రమాదం పెరగవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా షింగిల్స్ వచ్చిన వెంటనే కొన్ని రోజులు, వారాల్లో స్ట్రోక్ ప్రమాదంపై ఆధారాలు బలంగా ఉన్నాయని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరుకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అబి మనేష్ పేర్కొన్నారు.
అందువల్ల షింగిల్స్‌ను సాధారణ చర్మ సమస్యగా నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వయసు పెరిగినవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ప్రారంభ దశలో సరైన వైద్య చికిత్స తీసుకోవడం ద్వారా సమస్యలను నియంత్రించే అవకాశం ఉంటుంది.
షింగిల్స్ తర్వాత అకస్మాత్తుగా ముఖం వంగడం, ఒక వైపు చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం, తీవ్రమైన తలనొప్పి, ఛాతిలో నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందాలి.
Also Read:యువీ రికార్డును సమం చేసిన అభిషేక్
గమనిక: షింగిల్స్ ఉన్న ప్రతి ఒక్కరికీ గుండెపోటు లేదా స్ట్రోక్ వస్తుందని అర్థం కాదు. అయితే ఇలాంటి ప్రమాదాలపై పరిశోధనలు కొనసాగుతున్నందున, లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యమైనది.

