ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు, ఎక్కువ సమయం ఉండే తరగతులు వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. శుక్రవారం నాటికి 735కుపైగా పాఠశాలల్లో నిరసనలు, ఆందోళనల ప్రభావం కనిపించినట్లు ఫ్రాన్స్ విద్యాశాఖ వెల్లడించింది.
పారిస్ ప్రాంతంలో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. విద్యార్థులు పాఠశాలల ప్రవేశ ద్వారాలను అడ్డుకోవడంతో పాటు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అదుపు తప్పడంతో నిరసనకారులు, అల్లర్ల నియంత్రణ పోలీసులు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించగా.. కొందరు నిరసనకారులు పోలీసులపై వస్తువులు, బాణసంచా విసిరినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఆందోళనల నేపథ్యంలో భారీగా అరెస్టులు కూడా జరిగాయి. శుక్రవారం వరకు 1,747 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి విద్యా సిబ్బందిలో 65 మంది, విద్యార్థుల్లో సుమారు 170 మంది గాయపడినట్లు విద్యాశాఖ మంత్రి ఎడ్వార్డ్ గెఫ్రే తెలిపారు. పారిస్ ప్రాంతంలోని మూడు పాఠశాలల్లో అగ్నిప్రమాదాలు జరిగినట్లు కూడా సమాచారం.
విద్యార్థుల ప్రధాన డిమాండ్లలో తరగతి గదుల్లో రద్దీ తగ్గించడం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం, పాఠశాల భవనాల పరిస్థితులను మెరుగుపరచడం ఉన్నాయి. పాఠశాలల్లో తమ సమస్యలను ప్రభుత్వం మరింత శ్రద్ధగా వినాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల గైర్హాజరును వేగంగా భర్తీ చేసే చర్యలు చేపడతామని, విద్యార్థుల ప్రతినిధిత్వాన్ని మెరుగుపరుస్తామని ప్రకటించింది. అయితే విద్యార్థి సంఘాలు ఈ హామీలపై సంతృప్తి చెందలేదని, తదుపరి నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించాయి.
Also Read:యువీ రికార్డును సమం చేసిన అభిషేక్

