దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై జరుగుతున్న నిరసనలను, పోరాటాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, వాటిని డిజిటల్ మ్యాప్ ద్వారా ప్రదర్శించేందుకు వీలుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘సత్యాగ్రహ’ (Satyagraha) అనే నూతన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. “అన్యాయం” పై పోరాడుతున్న పౌరులు తమ కథనాలను, నిరసన వివరాలను ఈ వేదికపై సమర్పించాలని ఆయన కోరారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) లో వీడియో సందేశాన్ని పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ..ఈ వేదిక ద్వారా నిరసనకారులు తమ ఉద్యమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, దేశవ్యాప్తంగా ఒకే తరహా సమస్యలతో పోరాడుతున్న ఇతరులను ఇంటరాక్టివ్ మ్యాప్‌లో తెలుసుకోవచ్చని, ప్రత్యక్ష మద్దతును పొందవచ్చని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ సత్యాగ్రహ సిద్ధాంతాన్ని గుర్తుచేస్తూ సత్యం అత్యంత శక్తివంతమైన ఆయుధం, కానీ ఆ సత్యం కోసం అంతా కలిసి ఐక్యంగా నిలబడటం అంతకంటే పెద్ద ఆయుధం అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు — తరచూ వారు ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. జెన్ జీ (Gen Z) యూత్, విద్యార్థులు, రైతులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు — ప్రతి ఒక్కరి పోరాటానికి ఒక కథ ఉంది. కానీ ఒంటరిగా వినబడే గొంతుక తరచూ అనిచివేతకు గురవుతోంది. ఈ గొంతుకలన్నింటినీ ఒకే డిజిటల్ మ్యాప్‌పైకి తీసుకురావడమే ‘సత్యాగ్రహ’ ముఖ్య ఉద్దేశం” అని ఆయన తెలిపారు.
Also Read:యువీ రికార్డును సమం చేసిన అభిషేక్

