సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. అయితే ఇదే టెక్నాలజీని కొందరు వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా దుర్వినియోగం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నటి జాన్వీ కపూర్‌కు సంబంధించినట్లు ప్రచారం అవుతున్న ఓ మార్ఫింగ్ వీడియోపై హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు.
AI సాయంతో జాన్వీ కపూర్‌కు సంబంధించిన అసభ్యకరమైన నకిలీ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్.. AIని దుర్వినియోగం చేసి ఇలాంటి కంటెంట్‌ను సృష్టించే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహిళలను గౌరవించే సమాజంలో ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడటం ఏమిటని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.
అంతేకాకుండా AI సాంకేతికతను ఉపయోగించి వ్యక్తులను అవమానించేలా లేదా వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కంటెంట్ రూపొందించే వారిని వదిలిపెట్టబోనన్నట్టుగా ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. ఇదే తరహాలో సోషల్ మీడియాలో మరో వీడియో కూడా చర్చనీయాంశంగా మారింది. ‘ఇందిరమ్మ రాజ్యం’ పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా ఖాతా నుంచి జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు కలిసి ఉన్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి సంబంధించిన ఓ సన్నివేశాన్ని ఎడిట్ చేసి పోస్టు చేసినట్లు తెలుస్తోంది.
AI వంటి సాంకేతికత సృజనాత్మకతను పెంచేందుకు, వినోదం మరియు ఉపయోగకరమైన కంటెంట్ తయారీలో ఉపయోగపడాల్సినదే తప్ప.. వ్యక్తుల గౌరవం, ప్రతిష్ఠలను దెబ్బతీసే సాధనంగా మారకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ వీడియోలపై సంబంధిత సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేస్తున్నారు.


