తీవ్ర వివాదాలు, విమర్శల నడుమ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే చట్టబద్ధమైన ‘ఫామ్-6’ (Form 6) ఆన్‌లైన్ దరఖాస్తులో చేర్చిన ‘ప్రత్యేక తీవ్ర సవరణ’ (SIR) డిక్లరేషన్‌ను తన ECINET పోర్టల్ నుండి తొలగించింది. ఇప్పటికే SIR ప్రక్రియ ముగిసిన రాష్ట్రాల్లో ఈ మార్పును అమలు చేసింది.
ఫామ్-6 లో కేంద్ర కేంద్ర ప్రతిపాదనలు లేకుండా ఇటువంటి అదనపు డిక్లరేషన్లను జోడించడంపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం మరియు ఓటర్ల నమోదు నియమావళి (1960)కి సవరణలు లేకుండా ఈ మార్పు చేయడం అక్రమం మరియు అనధికారికం అని పేర్కొన్నారు.
ఓటరుగా నమోదవ్వాలనుకునే దరఖాస్తుదారులు తమ తల్లిదండ్రులు లేదా తాతముత్తాతలు గత SIR ఓటర్ల జాబితాలో ఉన్నారా లేదా అనే వివరాలను తెలియజేయాలంటూ ఫామ్-6 లో సెక్షన్ J మరియు K ల మధ్య కొత్త నిబంధనను డిజిటల్‌గా చేర్చారు. ఈ ప్రశ్నకూ సమాధానం ఇవ్వకపోతే దరఖాస్తు ముందుకు వెళ్లకుండా పోర్టల్‌లో సాంకేతిక అవరోధం సృష్టించారు.
అయితే ఓటర్ల నమోదు ప్రక్రియను డిజిటలైజ్ చేసే క్రమంలో ఐటీ విభాగం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఇష్టారాజ్యంగా నిబంధనలు మార్చడంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిర్ణయాలపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.
తీవ్ర రాజకీయ ఒత్తిడి, విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, సెప్టెంబర్ 26న ఎన్నికల సంఘం స్పందిస్తూ.. నాన్-SIR కాలానికి సాధారణ చట్టబద్ధమైన ఫామ్-6 నే ఉపయోగిస్తామని స్పష్టం చేసింది. అనంతరం బుధవారం రాత్రి ECINET అప్లికేషన్ పోర్టల్‌లో ఈ SIR డిక్లరేషన్‌ను తొలగిస్తూ అధికారిక చర్యలు చేపట్టింది. అయితే, ఇంకా SIR ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల్లో మాత్రం ఇది ప్రస్తుతం అమల్లో ఉంది.
Also Read:‘గోల్డెన్ భాగ్యం’..ఫుల్ ఫన్ టైటిల్

