సాగరహారానికి 14 ఏళ్లు!

4
- Advertisement -

తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రలో సెప్టెంబర్ 30, 2012కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉమ్మడి పాలకులు సృష్టించిన అడ్డంకులను, పోలీసు నిర్బంధాలను, లాఠీచార్జీలను, రబ్బర్ బుల్లెట్లను లెక్కచేయకుండా లక్షలాది మంది తెలంగాణవాదులు హుస్సేన్‌సాగర్ తీరానికి పోటెత్తిన మహోజ్వల ఘట్టం.. ‘తెలంగాణ మార్చ్’ (సాగరహారం). నేటితో ఈ చారిత్రక ఉద్యమానికి 14 ఏళ్లు పూర్తయ్యాయి.

నాడు తెలంగాణ జేఏసీ (TJAC) పిలుపునిచ్చిన ఈ సాగరహారాన్ని అణచివేయడానికి అప్పటి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. హైదరాబాద్ నగరం చుట్టూ ముళ్లకంచెలు వేసి, వేలాది మంది సీఆర్పీఎఫ్ దళాలను మోహరించింది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే రైళ్లు, బస్సులను నిలిపివేశారు. ఊరూరా ఉద్యమకారులను ముందస్తు అరెస్టులు చేశారు.

అయితే ఏ ఆంక్షలూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆపలేకపోయాయి. సకల జనులు నగరంలోకి చొచ్చుకొచ్చారు. బస్సులు లేకపోతే కాలినడకన, రైళ్లు ఆపితే పట్టాలెంబడి నడుచుకుంటూ లక్షలాది మంది ప్రజలు హుస్సేన్‌సాగర్ చుట్టూ చేరుకున్నారు.

హుస్సేన్‌సాగర్ తీరం గుండెచప్పుడులా మారిన వేళ.. ట్యాంక్ బండ్, నెక్కర్‌ రోడ్, లోయర్ ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ ‘జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగిపోయాయి. చిన్న, పెద్ద, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారులు.. తేడా లేకుండా అందరూ ఒకే గొంతుకై నిలబడ్డారు. సాయంత్రం వేళ వర్షం కురుస్తున్నా కూడా వెనక్కి తగ్గకుండా, పట్టుదలతో నినాదాలు చేస్తూ సాగరహారాన్ని విజయవంతం చేశారు.

Also Read:‘గోల్డెన్ భాగ్యం’..ఫుల్ ఫన్‌ టైటిల్

సాగరహారం ప్రదర్శించిన ప్రజాశక్తి ఉమ్మడి పాలకుల కుట్రలను తిప్పికొట్టడమే కాకుండా, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిని పెంచింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక మార్గం లేదని కేంద్రానికి స్పష్టమైన సంకేతాన్ని పంపిన ఘట్టం ఇది.తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తుది ఘట్టానికి నాంది పలికిన ఈ తెలంగాణ మార్చ్, నేటికీ ప్రతి తెలంగాణవాది గుండెల్లో ఉద్వేగాన్ని, స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుంది.

- Advertisement -