ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా …బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారని ఇందుకు సంబంధించిన ఆధారాలు, వాస్తవాలు దేశ ప్రజల ముందే ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.
వాయనాడ్‌లో విలేకరులతో మాట్లాడిన ప్రియాంక గాంధీ…ఇది చాలా పాతబడిన, బలహీనమైన వాదన. ఇక్కడ స్పష్టమైన ఆధారాలు, వాస్తవాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ ఇప్పటికే అనేక పత్రికా సమావేశాల్లో ఈ ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారనేది స్పష్టమైన నిజం. బీజేపీ ఇకనైనా లొసుగు సమాధానాలు, సాకులు చెప్పడం మానాలి అని ప్రియాంక డిమాండ్ చేశారు.
ఎన్నికల వ్యవస్థను, ఓటర్ల జాబితాలను మేనిపులేట్ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి మరియు దేశానికి వ్యతిరేకంగా చేసే తీవ్రమైన నేరమని ఆమె మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారనే కారణంతో ఎవరికీ చట్టపరమైన మినహాయింపులు ఉండకూడదని, తప్పు చేసినట్లు తేలితే ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై కూడా “దేశద్రోహం” కింద నేర విచారణ జరపాలని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read:గణేశుడి లడ్డూ@రూ. కోటి
ఓటర్ల తొలగింపుల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తదుపరి పోరాట కార్యాచరణను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో నిర్ణయిస్తుందని ప్రియాంక గాంధీ వెల్లడించారు.

