సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్లు రావడం, ప్రజలు ఉత్సాహంగా వాటిని అనుసరించడం సాధారణ విషయమే. అయితే, ఓ మహిళకు మాత్రం ఈ సోషల్ మీడియా ట్రెండ్ ఊహించని షాక్ ఇచ్చింది. 45 ఏళ్ల క్రితం చేసిన దొంగతనం నుంచి తప్పించుకుని నిశ్చింతగా బతుకుతున్న ఆమెను, ఒక వైరల్ ట్రెండ్ పోలీసులకు పట్టించింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ సుమారు 45 సంవత్సరాల క్రితం స్థానిక స్వర్ణకారుడి (కంసాలి) దుకాణం నుంచి ఒక విలువైన బంగారు హారాన్ని దొంగిలించింది. ఆ తర్వాత తన గుర్తింపును దాచడానికి పేరు మార్చుకుని వేరే ప్రాంతానికి వెళ్లి సాధారణ జీవితం గడపడం ప్రారంభించింది. దశాబ్దాలు గడిచిపోవడంతో ఆ కేసు కూడా కాలగర్భంలో కలిసిపోయింది.
ఇటీవల సోషల్ మీడియాలో ’80’s ట్రెండ్’ బాగా ప్రసిద్ధి చెందింది. అందులో భాగంగా యూజర్లు తమ ఫోటోలను 1980ల కాలం నాటి శైలిలోకి మార్చి (ఏఐ లేదా ఫిల్టర్ల సాయంతో) పోస్ట్ చేస్తున్నారు. ఈ సరదా ట్రెండ్‌లో సదరు మహిళ కూడా పాల్గొంది. తన ఫోటోను 80ల నాటి గెటప్‌లోకి మార్చి సోషల్ మీడియా వేదికల్లో పంచుకుంది.
ఆ పోస్ట్ అనుకోకుండా నాటి బాధితుడైన స్వర్ణకారుడి కంట పడింది. ఫోటోలో ఉన్న ముఖరూపాలు, 80ల నాటి లుక్ చూసిన ఆ వ్యాపారికి.. 45 ఏళ్ల క్రితం తన దుకాణంలో హారం ఎత్తుకెళ్లిన మహిళే ఈమె అని వెంటనే గుర్తొచ్చింది. ఆలస్యం చేయకుండా ఆయన ఈ ఆధారంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
Also Read:అమెరికాకు లొంగిపోయిన మోదీ!
స్వర్ణకారుడి ఫిర్యాదుతో పోలీసులు పాత రికార్డులు తిరగేసి కేసును రీఓపెన్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆమె తప్పించుకోలేక 45 ఏళ్ల క్రితం తానే ఆ దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది.
పాపం సరదా కోసం పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్, నాలుగు దశాబ్దాల క్రితం నాటి దొంగతనాన్ని బయటపెడుతుందని ఆ మహిళ కలలు కూడా ఊహించి ఉండదు

