అమెరికా-కెనడా..వాణిజ్య యుద్ధం

1
- Advertisement -

అమెరికా, కెనడాల మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రస్థాయికి చేరింది. కెనడా నుంచి దిగుమతి అయ్యే డెయిరీ ఉత్పత్తులు, అనేక రకాల ఆల్కహాలిక్ పానీయాలు, మోటార్‌సైకిళ్లపై నిషేధం విధిస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. అమెరికా నుంచి జరిగే 20 బిలియన్ డాలర్ల దిగుమతులపై కెనడా ప్రతీకార సుంకాలను విధించిన అనంతరం వైట్‌హౌస్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధ ఉత్తర్వులు మూడు వారాల్లో అమలులోకి రానున్నాయి.

మరోవైపు కెనడా ప్రతీకార సుంకాలు అమలులోకి రావడంతో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీర్ఘకాలిక ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి కెనడా ఉత్పత్తులను మినహాయించే దిశగా చర్యలు చేపట్టారు. అమెరికా ఉత్పత్తులకు కెనడా “పూర్తి స్థాయి, న్యాయమైన పరస్పర సౌలభ్యాన్ని” కల్పించే వరకు ఆ కాంట్రాక్టులకు కెనడా ఉత్పత్తులను అనర్హులుగా ప్రకటించాలని యూఎస్ జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్‌ను ట్రంప్ ఆదేశించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పందిస్తూ ఏ దేశం కూడా తమను ఆర్థికంగా ఒత్తిడికి గురిచేయకుండా తమకు ఇష్టమైన రీతిలో జీవించేందుకు కెనడా మరింత స్వయంసమృద్ధి సాధించడమే తమ వ్యూహమని పేర్కొన్నారు. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

సభ్యత్వం పొందే స్థాయికి కాస్త ముందే ఆగిపోయేలా యూరోపియన్ యూనియన్ (EU) తో బంధాన్ని బలపరుచుకోవడానికి కెనడా మార్గాలను అన్వేషిస్తోంది. ప్రస్తుత ఒప్పందాల విస్తరణ లేదా కొత్త ఒప్పందం దిశగా ప్రావిన్సులు, వర్కర్ గ్రూపులతో చర్చలు జరుపుతోంది. కెనడా ఎగుమతుల్లో ఇప్పటికీ 70 శాతానికి పైగా అమెరికాకే వెళ్తున్నాయి. అయితే రాబోయే పదేళ్లలో ఇతర దేశాలకు చేసే ఎగుమతులను రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కార్నీ తెలిపారు.ప్రతీకార చర్యలపై కెనడా సమర్థన:కెనడా కంపెనీలపై అమెరికా సుంకాలు విధిస్తున్నప్పుడు, అమెరికా వస్తువులను పన్నులు లేకుండా తమ దేశంలోకి అనుమతించలేమని ప్రధాని కార్నీ సమర్థించుకున్నారు. తాము వివాదాన్ని పెంచాలని అనుకోవడం లేదని, అయితే కెనడా కార్మికుల ప్రయోజనాలను కాపాడుకోవడానికే ఈ సుంకాలు తప్పడం లేదని అన్నారు. విఫలమైన చర్చలలో వాషింగ్టన్ విధించిన షరతుల వల్ల కెనడా వారిపై మరింత ఆధారపడేలా చేసేలా ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన వివరించారు.

Also Read:BB10:సైన్యం టాస్క్‌లో మంటలు!

- Advertisement -