బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 రెండు రోజులు పూర్తి చేసుకుంది. రెండో రోజు ఇంటి సభ్యుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. రెండో రోజు ఆటలో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విభజించి, సెలబ్రిటీల నుంచి రాం ప్రసాద్‌ను, సామాన్యుల నుంచి రోహిత్‌ను నాయకులుగా ఎంచుకున్నారు.
గార్డెన్ ఏరియాలో ఉంచిన బ్యాగ్‌ల ఆధారంగా ఇరువురు నాయకులు తమ సైన్యాన్ని ఎంపిక చేసుకున్నారు. రాం ప్రసాద్ తన టీమ్‌లోకి త్రిగుణ్, నరేష్, దేబ్జానీలను తీసుకోగా రోహిత్ తన వైపు అమన్, టెంపర్ వంశీ, శాలినిలను ఎంచుకున్నాడు. అయితే, చివరికి మిగిలిన కృష్ణుడు, చైత్రలను ఎంపిక చేసుకునే క్రమంలో రోహిత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. “ఫిజికల్‌గా వీక్‌గా ఉంది కాబట్టి చైత్రను నా టీమ్‌లోకి తీసుకుంటున్నా అని రోహిత్ అనడంతో కృష్ణుడికి కోపం వచ్చింది. దానికి కౌంటర్‌గా రాం ప్రసాద్ సమయానుకూలంగా స్పందించి కృష్ణుడిని తన వైపు తిప్పుకున్నాడు.
ఈ క్రమంలో రోహిత్ పై ఆర్జే చరణ్, వర్షిణిలు సెటైర్లు వేశారు. “ఓడిపోయినా పర్లేదు కానీ గెలవాలి” అని రోహిత్ అన్న మాటలకు “నీలోకి సడెన్‌గా రామకృష్ణ వచ్చేశాడేంటి?” అంటూ చరణ్ గాలి తీసేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండటానికి అనర్హులైన వారిని ఎన్నుకునే టాస్క్‌లో యాంకర్ వర్షిణి ఊహించని విధంగా రోహిత్ పేరును ప్రతిపాదించింది. బ్లూ టీమ్ సభ్యుల మధ్య ఆమె రోహిత్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టింది.
అగ్నిపరీక్షలో రోహిత్‌ను బాగా లేపి కూర్చోబెట్టడంతో అతను తనను తాను ‘తోపు’లా భావిస్తున్నాడని, రావడమే పెద్ద దేవుడిలా బిల్డప్ ఇస్తున్నాడని వర్షిణి మండిపడింది. టీమ్ సభ్యులపై చులకన భావం: అందరి ఎంగిలి పాత్రలు తాను కడగాలా? అని రోహిత్ చేసిన యాక్షన్‌ను గుర్తుచేస్తూ, “అతనికి కళ్లు నెత్తికెక్కాయి, అతనికి రియాలిటీ ఏంటో తెలియజెప్పి కిందకి దింపాలి” అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
అదే సమయంలో దేబ్జానీ మరో పోటీదారు శాలినిపై స్పందిస్తూ.. ఆమె ప్రతీ చిన్న విషయానికి గొడవపడుతోందని, హౌస్‌లో తనే గొప్ప అనే భావనలో ఉందంటూ అనర్హురాలిగా ప్రకటించింది. అగ్నిపరీక్ష షో ద్వారా వచ్చిన పాపులారిటీ రోహిత్ ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయం హౌస్‌లో వ్యక్తమవుతోంది. అగ్నిపరీక్షలో లభించిన ప్రశంసల వల్ల అతను రియాలిటీకి దూరంగా ఆలోచిస్తున్నాడని వర్షిణి చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read:వైరల్ చిట్కా..రహాస్యం ఏంటో తెలుసా?
రోహిత్ ఎదురుగా లేనప్పుడు వర్షిణి ఈ స్థాయిలో విరుచుకుపడినప్పటికీ, ఆమె అన్న మాటల్లో నిజం లేకపోలేదని మిగతా సభ్యుల సంభాషణలను బట్టి అర్థమవుతోంది. రానున్న రోజుల్లో రోహిత్ తన ప్రవర్తనను మార్చుకుంటాడా లేదా ఈ వివాదాలు మరింత ముదురుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

