మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కర్ణాటక పీడబ్ల్యూడీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సతీష్ జార్కిహోళి, ఆయన కుమార్తె (ఎంపీ) ప్రియాంక జార్కిహోళితో పాటు మరికొందరి ప్రాంగణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. కర్ణాటకలోని బెంగళూరు, బెళగావితో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న దాదాపు 18 ప్రాంతాల్లో ఈడీ బృందాలు తనిఖీ చేపట్టాయి.
బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న 64 ఏళ్ల మంత్రి అధికారిక నివాసం కూడా వీటిలో ఉంది. ఉదయం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందితో కూడిన ఈడీ అధికారుల బృందం రెండు వాహనాల్లో మంత్రి అధికారిక నివాసానికి చేరుకుంది. అనంతరం ఆ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ సోదాల్లో ఏవైనా వస్తువులు లేదా నగదు రికవరీ చేశారా అనే వివరాలను ఈడీ ఇంకా వెల్లడించలేదు.
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం ఈ దర్యాప్తు కేవలం సతీష్ జార్కిహోళికి మాత్రమే పరిమితం కాలేదు. చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ అయిన ఆయన కుమార్తె ప్రియాంక జార్కిహోళికి చెందిన ప్రాంగణాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఆయన బావమరిది వై. మంజునాథ్‌కి చెందిన స్థావరాల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.ఈ కేసు మంజునాథ్‌పై ఉన్న అబ్కారీ (ఎక్సైజ్) కేసుకు సంబంధించినది కాదు..ఇది సతీష్ జార్కిహోళిపై నమోదు చేసిన వేరొక మనీ లాండరింగ్ కేసు.
సతీష్ జార్కిహోళి ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) మంత్రిగా సేవాలందిస్తున్నారు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా గుర్తింపు పొందారు. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అత్యంత ఆప్తుడిగా భావిస్తారు.దీంతో మంత్రి మరియు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన స్థావరాలపై ఈడీ చేపట్టిన ఈ చర్యలకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read:BB10:సైన్యం టాస్క్‌లో మంటలు!

