రేవంత్..అమెరికా పర్యటన రద్దు!

4
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక అమెరికా (USA) పర్యటన రద్దయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23న అక్కడి నుండి నేరుగా అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే, ఈ పర్యటన రద్దు కావడంతో ఆయన లండన్ నుంచే నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

ప్రోటోకాల్ మరియు నిబంధనల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రుల విదేశీ పర్యటనలకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నుండి రాజకీయామోదం పొందాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి యూకే (UK), యూఎస్ (USA) పర్యటనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందే అనుమతి కోరినప్పటికీ, కేంద్రం కేవలం లండన్ (యూకే) పర్యటనకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో ఈ టూర్ రద్దయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

కేంద్ర నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “తెలంగాణ యువతకు గ్లోబల్ నైపుణ్యాలు, ప్రపంచస్థాయి విద్యావకాశాలు అందించాలనే లక్ష్యంతోనే ఐవీ లీగ్ మరియు ప్రతిష్టాత్మక వర్సిటీల ప్రతినిధులను కలిసేందుకు ఈ పర్యటన ఖరారు చేశాం. యువత భవిష్యత్తు, దేశాభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి” అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్రం నుంచి సీఎం పర్యటనకు అనుమతి రాకపోయినప్పటికీ, రాష్ట్రానికి పెట్టుబడులు, విద్యా ఒప్పందాలు అత్యంత కీలకమైనందున అధికారుల బృందాన్ని మాత్రం అమెరికా పర్యటనకు పంపాలని సీఎం ఆదేశించారు. దీంతో తెలంగాణ ప్రతినిధి బృందంలోని ఉన్నతాధికారులు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే అమెరికాలో పర్యటించి, ఎంఓయూలు (MoUs) మరియు భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయనున్నారు.

కాగా, రేవంత్ రెడ్డి పర్యటన రద్దు కావడంపై సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో భిన్నమైన ప్రచారాలు సాగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల తలెత్తిన అంతర్గత వివాదాలు, నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో విదేశీ పర్యటనలను అర్ధాంతరంగా ముగించుకుని రావాలని కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరించడం వల్లే సీఎం తిరిగి వస్తున్నారని ప్రత్యర్థి వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, విదేశాంగ శాఖ పర్మినెంట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడమే పర్యటన రద్దుకు అసలు కారణమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

Also Read:RAC..రైల్వే శాఖకు జరిమానా

- Advertisement -