వారంతా ఇప్పుడు దేశద్రోహులా?

3
- Advertisement -

వందేమాతరం గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించే విధానాన్ని ఆమోదించినందుకు మహాత్మా గాంధీ, పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి స్వాతంత్ర్య సమరయోధులను కూడా నేడు బీజేపీ “దేశద్రోహులు” అని అంటుందా అని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే శుక్రవారం ప్రశ్నించారు.

కేంద్రంలోని అధికార పార్టీ తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి జాతీయ చిహ్నాలను ఆయుధాలుగా వాడుకుంటోందని ఖర్గే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. 1937లో గాంధీజీ, పటేల్ జీ, నెహ్రూజీ, నేతాజీ బోస్, ఠాగూర్ కలిసి వందేమాతరంలోని ఏ భాగాలను బహిరంగంగా పాడాలో సుదీర్ఘంగా చర్చించారు. మరి ఇప్పుడు వారందరూ ‘దేశద్రోహులు’ అవుతారా? అని ఆయన ప్రశ్నించారు.

ఇటీవల ఢిల్లీ, గోవాల్లో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమాల్లో జాతీయ గేయాన్ని అరకొరగా ఆలపించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ సహా పలువురు నేతలు వందేమాతరాన్ని అవమానించారని బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో ప్రియాంక్ ఖర్గే ఈ విధంగా ఘాటుగా స్పందించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS)లకు వందేమాతరం పట్లనిజంగానే గౌరవం ఉంటే వారు ఆదర్శంగా నిలవాలని సవాల్ విసిరారు. ఆర్‌ఎస్‌ఎస్ తమ రోజువారీ శాఖల్లో పాడే “నమస్తే సదా వత్సలే మాతృభూమే” ప్రార్థనకు బదులుగా “వందేమాతరం” పాడాలని కోరారు.

అంతేకాకుండా, బీజేపీ అగ్రనేతలు ఎటువంటి సహాయం లేకుండా వందేమాతరం పూర్తి గేయాన్ని పాడగలరా అని ఖర్గే సవాల్ విసిరారు. “బీజేపీ దేశానికి హితబోధ చేసే ముందు, తమ స్వంత నాయకులలో ఎంతమంది వందేమాతరాన్ని పూర్తిగా జపించగలరో చెప్పాలి. మోదీ జీ, అమిత్ షా జీ టెలిప్రాంప్టర్ సాయం లేకుండా జాతీయ గేయాన్ని పూర్తిగా పాడి చూపించాలి” అని అన్నారు. దేశంలో నిరుద్యోగం, ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఆర్థిక సవాళ్లు, పీఎం కేర్స్ (PM CARES) నిధులపై వస్తున్న ప్రశ్నల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే బీజేపీ ఈ వివాదాన్ని లేవనెత్తిందని ఖర్గే విమర్శించారు.

Also Read:RAC..రైల్వే శాఖకు జరిమానా

- Advertisement -