కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) ప్రక్రియను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం తీవ్రంగా వ్యతిరేకించారు. గత 25 ఏళ్లుగా కుటుంబ నియంత్రణ విధానాలను విజయవంతంగా అమలు చేసినందుకు తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోకూడదని ఆయన అన్నారు.
లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 స్థానాల వద్దే స్థిరీకరించాలని (ఫ్రీజ్ చేయాలని) ఆయన డిమాండ్ చేశారు. స్థానాల సంఖ్యను భారీగా పెంచితే అది సభ స్వరూపాన్నే దెబ్బతీస్తుందని హెచ్చరించారు. “లోక్‌సభ స్థానాలను 543 వద్దే నిలిపివేయాలి లేకపోతే అది చైనా పార్లమెంట్ లాగా మారుతుంది. అది ప్రజా సభలా కాకుండా ఒక బహిరంగ సభలా తయారవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ తమిళనాడు శాసనసభ తీర్మానం ఆమోదించడం సరైన చర్య అని చిదంబరం పేర్కొన్నారు. ఒకే ఒక్క బీజేపీ సభ్యుడు మినహా తమిళనాడు మొత్తంగా ఈ అంశంపై ఏకతాటిపైకి వచ్చిందని ఆయన అన్నారు. భవిష్యత్తులో చేపట్టే ఎలాంటి పునర్విభజన ప్రక్రియలోనైనా తమిళనాడుతో సహా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య శాతాన్ని కాపాడాలని మాజీ కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేయకూడదు. వాటి ప్రాతినిధ్య వాటాను యథాతథంగా ఉంచాలి అని చెప్పారు.
Also Read:RAC..రైల్వే శాఖకు జరిమానా
జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)లో ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన తెలిపారు. ఇది అనవసరమైన బిల్లు అని అభిప్రాయపడ్డారు.తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోకూడదని ఆందోళన చెందుతున్నాయని, జేపీసీ స్థాయిలో ఈ బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్ నిశ్చయించుకుందని చిదంబరం స్పష్టం చేశారు.

