కేరళలో పాఠశాల ఓనం పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేరళ విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. ఇవి తప్పుడు వార్తలని స్పష్టం చేస్తూ ఈ పుకార్లను వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి కార్యాలయం సైబర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది.
కొన్ని సోషల్ మీడియా ఖాతాలు మరియు యూట్యూబ్ ఛానెళ్లు రాబోయే ఓనం టర్మ్ పరీక్షల ప్రశ్నపత్రాలు తమ వద్ద ఉన్నాయంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేస్తున్నాయని విద్యాశాఖ పేర్కొంది.
విద్యార్థులలో ఆందోళన కలిగించి, పరీక్షల ప్రక్రియను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న సైబర్ నేరగాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. ఓణం పరీక్షల ప్రశ్నపత్రాలన్నీ అత్యంత భద్రతా ప్రమాణాల మధ్య భద్రంగా ఉన్నాయని, ఎలాంటి లీకేజీ జరగలేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
విద్యాశాఖ మంత్రి కార్యాలయం విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ.. సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి రూమర్లను, నకిలీ వార్తలను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
Also Read:కాంగ్రెస్‌కు మరో సెగ..చిన్నారెడ్డి ఫైర్

