నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.4,000 కోట్లు అని ప్రచారం జరుగుతుండటంపై చిత్ర సహ-నిర్మాత, నటుడు యష్ క్లారిటీ ఇచ్చారు. ఈ బడ్జెట్ వెనుక ఉన్న అసలు నిజాలను ఆయన ఒక టాక్ షో (‘ఆప్ కీ అదాలత్’)లో వెల్లడించారు.
రూ.4,000 కోట్ల బడ్జెట్ అనేది ఒకే భాగానికి అనుకోవడం అపోహ. ఈ విషయాన్ని అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నాను. రూ.4,000 కోట్లు అనేది రెండు భాగాల (Part 1 & Part 2) నిర్మాణ ఖర్చులతో పాటు, వాటి విడుదల మరియు అంతర్జాతీయ (హాలీవుడ్ స్థాయి) ప్రమోషన్ల ఖర్చులను కలిపి లెక్కించిన మొత్తం అని యష్ తెలిపారు.
హాలీవుడ్‌లో ఒక గ్లోబల్ సినిమా తీసేటప్పుడు నిర్మాణ వ్యయంతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా పబ్లిసిటీ, ప్రమోషన్ల కోసం ఖర్చు చేస్తారని యష్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ భాగస్వామి నమిత్ మల్హోత్రా హాలీవుడ్ పద్ధతిలోనే ఈ మొత్తం బడ్జెట్ వివరాలను వెల్లడించారని చెప్పారు. ప్రపంచ స్థాయిలో సినిమాను తీసుకెళ్తున్నప్పుడు ప్రమోషన్ల ఖర్చు అధికంగానే ఉంటుందని, అయితే దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
సినిమా అనేది దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటే ఒక శక్తివంతమైన సాధనమని యష్ అభిప్రాయపడ్డారు. భారతీయ సినిమా స్థాయిని పెంచడానికి మనం తీవ్రంగా శ్రమించాలి. ఈ రోజు కాకపోతే రేపైనా మనం గ్లోబల్ మార్కెట్‌ను సాధిస్తాం. మేము చేయకపోతే మరొకరు చేస్తారు, కానీ ఇది జరగాలి. ‘రామాయణం’ మరియు ‘టాక్సిక్’ చిత్రాలు భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే అని యష్ వ్యాఖ్యానించారు.
Also Read:కాంగ్రెస్‌కు మరో సెగ..చిన్నారెడ్డి ఫైర్
ఈ రెండు భాగాల ఎపిక్ డ్రామాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తుండగా.. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. ‘రామాయణం మొదటి భాగం’ 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది.

