‘జనగణన 2027’ (Census 2027) రెండవ విడత జనాభా లెక్కింపు ప్రక్రియ కోసం రూపొందించిన 40 ప్రశ్నల వివరాలతో కొత్త నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది. రజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియా (RG&CCI) జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాల ‘కులం’ వివరాలను నమోదు చేయడం ఇదే తొలిసారి.
గతంలో 2011లో జరిగిన జనాభా లెక్కింపుతో పోలిస్తే, ఈసారి ప్రశ్నాపత్రంలో 14 కొత్త లేదా సవరించిన ప్రశ్నలను చేర్చారు. ప్రశ్నాపత్రంలోని 10వ ప్రశ్నలో షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) లతో పాటు “ఇతర కులం” అనే విభాగాన్ని చేర్చారు. పౌరులు తెలిపే కులాన్ని అధికారులు నేరుగా నమోదు చేస్తారు.
గుర్తింపు మరియు సమాచార వివరాలు:
ఆధార్ నంబర్ (లభ్యతను బట్టి)
మొబైల్ నంబర్
ఓటర్ ఐడీ వివరాలు
పాస్‌పోర్ట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు
ఆర్థిక & డిజిటల్ అంశాలు:
మొత్తం బ్యాంక్ ఖాతాల సంఖ్య
పౌరుల డిజిటల్ అక్షరాస్యత (Digital Literacy) స్థాయి
ఇతర పారామితులు:
తల్లిదండ్రుల పూర్తి వివరాలు (పుట్టిన తేదీ, స్థలం)
జీవిత భాగస్వామి (Spouse) పేరు
కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకున్న స్థలం
శాశ్వత నివాస చిరునామా
2011 జనాభా లెక్కింపులో కేవలం 29 ప్రశ్నలు మాత్రమే ఉండగా, 2027 సెన్సస్‌లో వాటి సంఖ్య 40కి పెరిగింది. వీటిలో కొన్ని ప్రశ్నలు (తల్లిదండ్రుల పుట్టిన స్థలం, ఐడీ కార్డులు, మొబైల్ నంబర్లు మొదలైనవి) గతంలో 2019-2020 సమయంలో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) మరియు పౌరసత్వ సవరణ చట్టం (CAA) నిరసనల సమయంలో తీవ్ర వివాదాస్పదమైన అంశాలనే పోలి ఉండటం గమనార్హం.అయితే ప్రస్తుతానికి ఎన్పీఆర్ (NPR) లేదా ఎన్ఆర్సీ (NRC) నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ప్రకటన చేయలేదు.
Also Read:Dharman:పవర్ఫుల్ డాక్టర్‌గా రజనీ
భారతదేశ చరిత్రలోనే ఇది తొలి డిజిటల్ సెన్సస్. డేటా సేకరణ మొత్తం డిజిటల్ పరికరాల ద్వారా జరుగుతుంది. అలాగే పౌరులు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.తొలి విడత ఇళ్ల నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత, జనాభా లెక్కింపు ప్రక్రియ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

