కరూర్ తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.జస్టిస్ జె.బి. పార్డీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తాత్కాలిక ఉత్తర్వులను వెలువరించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం. సాయి కుమార్ మరియు ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌ను సుప్రీంకోర్టు గట్టిగా ప్రశ్నించింది.
“ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి మీరు ఎవరు? ఒకవేళ ఆ దుర్ఘటనలో కుటుంబానికి ఆధారమైన ఏకైక వ్యక్తి మరణిస్తే, వారి కుమారుడికి లేదా కుమార్తెకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించవద్దా? అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2025 సెప్టెంబర్ 27న ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) వ్యవస్థాపకుడు సి. జోసెఫ్ విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించిన సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా అనేకమంది గాయపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల విజయం అనంతరం తమిళనాడు 22వ ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణ స్వీకారం చేసిన విజయ్… ఈ దుర్ఘటన బాధితుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత బాధితుల బంధువులైన 31 మందికి ప్రభుత్వ నియామక పత్రాలను స్వయంగా అందజేశారు.అయితే జూలై 27న జస్టిస్ సి.వి. కార్తికేయన్, జస్టిస్ ఆర్. శక్తివేల్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి కోరికలకు ద్వారాలు తెరిచినట్లవుతుందని పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇప్పటికే అనేకమంది వెయిటింగ్ లిస్ట్‌లో వేచి చూస్తున్నప్పుడు, వారి అవసరాలను పక్కనబెట్టి కరూర్ ఘటన బాధితులకు ఇలా ఉద్యోగాలు ఇవ్వడం సరికాదు. ఈ నియామకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 16 ద్వారా పౌరులకు లభించే సమానత్వ హక్కులకు ప్రత్యక్షంగా భంగం కలిగిస్తున్నాయి అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Also Read:టెక్నాలజీ నన్ను కాపాడింది!

