భారతదేశానికి చెందిన ‘జెన్ జీ’ (Gen Z – 1997 నుండి 2012 మధ్య జన్మించిన యువత) అనగానే మనకు టూర్లు, షాపింగ్, విలాసవంతమైన జీవనశైలి, డిజిటల్ లగ్జరీలు గుర్తుకువస్తాయి. అయితే వారు నిజంగా డబ్బును దేనికోసం ఖర్చు చేస్తున్నారనే విషయానికి వస్తే పరిస్థితి అస్సలు వేరేలా ఉంది.
ఓ అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న జెన్ జీ యువత తమ నెలవారీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని రోజువారీ అవసరాలు మరియు క్రమం తప్పకుండా చెల్లించాల్సిన ఆర్థిక బాధ్యతల కోసమే ఉపయోగిస్తున్నారు. మనం అనుకుంటున్నట్లుగా ప్రయాణాలు లేదా టూర్ల కోసం వారు చేస్తున్న ఖర్చు వారి నెలవారీ బడ్జెట్లో కేవలం 5 శాతం మాత్రమే.
వేతనాలు పొందే 5.2 లక్షలకు పైగా జెన్ జీ వినియోగదారులు జరిపిన మిలియన్ల కొద్దీ యూపీఐ (UPI) లావాదేవీలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.లైఫ్స్టైల్కే ప్రాధాన్యత ఇస్తారనే పేరున్న జెన్ జీ తరహా విధానాన్ని ఈ అధ్యయనం సవాలు చేస్తోంది. దానికి బదులుగా, వారి సంపాదనలో ఎక్కువ భాగం కరెంట్ భత్యాలు/బిల్లులు, కిరాణా సరుకులు, ఆర్థిక సేవలు, సాధారణ షాపింగ్ మరియు ఆహారం (ఫుడ్) కోసమే వెళ్తోంది.
జెన్ జీ ఎక్కువగా ఎక్కడ డబ్బును ఖర్చు చేస్తుందంటే.. జెన్ జీ నెలవారీ ఖర్చుల్లో బిల్లులు, సబ్స్క్రిప్షన్లు అతిపెద్ద వాటాను (20.1 శాతం) ఆక్రమిస్తున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో కిరాణా సరుకులు : 15.7%,ఆర్థిక సేవలు : 12.2%,షాపింగ్ : 11.9%,ఆహారం : 11.5%గా ఉంది. ఈ ఐదు విభాగాలను కలిపితే వారి నెలవారీ ఖర్చులలో 70 శాతానికి పైగా ఇక్కడే సరిపోతోంది. అంటే ఆర్భాటాలకు కాకుండా అత్యంత సాధారణమైన నిత్య అవసరాలకే వారి బడ్జెట్లో సింహభాగం కేటాయిస్తున్నారని ఇది స్పష్టం చేస్తోంది.
అలాగే బిల్లులు, సబ్స్క్రిప్షన్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆధిక్యంలో ఉండటం అనేది యంగ్ ప్రొఫెషనల్స్ రోజువారీ జీవితంలో డిజిటల్ చెల్లింపులు ఎంతగా భాగమయ్యాయో తెలియజేస్తోంది.అయితే వినోద ఆధారిత సబ్స్క్రిప్షన్లు జెన్ జీ ఖర్చుల అలవాట్లలో భాగమయ్యాయి. వినోద విభాగంలో చూస్తే జియోహాట్‌స్టార్ 12.4 శాతంతో అగ్రస్థానంలో ఉండగా నెట్‌ఫ్లిక్స్ 10.7 శాతంతో , స్పాటిఫై 5.6 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
జెన్ జీ యూపీఐ మరియు ఆటోపే వంటి సౌకర్యాలను బిల్లులు, ఈఎమ్ఐలు, డిజిటల్ సబ్స్క్రిప్షన్ల కోసం విరివిగా ఉపయోగిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఆటోమేటిక్‌గా బిల్లులు చెల్లించబడటం, సబ్స్క్రిప్షన్లు రెన్యూ అవ్వడం వీరి జీవనశైలిగా మారింది. ఈ అధ్యయనంలో 18-23 సంవత్సరాలు మరియు 24-29 సంవత్సరాల వయస్సు గల రెండు జెన్ జీ సమూహాలను విశ్లేషించారు. ఆశ్చర్యకరంగా, రెండు సమూహాలలోనూ విలాసాల కోసం చేసే ఖర్చు 32 శాతంగానే మార్పు లేకుండా ఉంది.
యూపీఐ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు యువ ఉద్యోగులు డబ్బును ఖర్చు చేసే తీరును మార్చాయని అభిప్రాయపడ్డారు. రూమర్లు, స్టీరియోటైప్స్ చెబుతున్నట్లు కాకుండా… భారతీయ యువ ఉద్యోగుల నెలవారీ బడ్జెట్ ఇప్పటికీ బిల్లులు చెల్లించడం, నిత్యావసరాలు కొనడం మరియు ఆర్థిక నిర్వహణ వంటి ప్రాథమిక అవసరాల చుట్టూనే తిరుగుతోంది. ట్రావెలింగ్, లైఫ్‌స్టైల్ ఖర్చులు ఉన్నప్పటికీ, అవి వారి ప్రధాన బడ్జెట్‌ను శాసించడం లేదు.
ALso Read:టెక్నాలజీ నన్ను కాపాడింది!

