నాల్సార్ (NALSAR) విశ్వవిద్యాలయం నుండి ఉత్తీర్ణులైన విద్యార్థులను ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనూ లాయర్లుగా నమోదు చేయవద్దని (ఎన్‌రోల్ చేయవద్దని) బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) జారీ చేసిన ఆదేశాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని సూచించారు.
యూనివర్సిటీ కాన్వొకేషన్ (పట్టభద్రుల ఉత్సవం)కి ప్రధాన న్యాయమూర్తి హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు చేపట్టిన నిరసనపై విచారణ పూర్తయ్యే వరకు, ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలని న్యాయవాద వృత్తిని నియంత్రించే అత్యున్నత సంస్థ అయిన BCI ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులు జారీ చేసిన కొద్ది గంటల్లోనే BCI స్పందిస్తూ… 2026 నాల్సార్ బ్యాచ్‌కి చెందిన ఎక్కువ మంది విద్యార్థులు అమాయకులని, ప్రధాన న్యాయమూర్తిని అనవసరంగా నిరసించే ఆలోచన వారికి లేదని తమకు సమాచారం అందిందని తెలిపింది.
ఇది ఎంతమాత్రం తగని పని. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నిరసనల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. ఇది నాకూ, విద్యార్థులకూ మధ్య నడిచే ఒక చర్చ.. ఇందులో జోక్యం చేసుకోవడానికి బార్ కౌన్సిల్ ఎవరు? అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Also Read:టెక్నాలజీ నన్ను కాపాడింది!
సుప్రీంకోర్టు ఈ వివాదాస్పద సర్క్యులర్లపై బిసిఐ స్పందనను కోరింది. అలాగే నాల్సార్ విద్యార్థులు లేదా అధ్యాపకులపై ఎలాంటి క్రమశిక్షణ లేదా శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. అంతకుముందు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కూడా BCI నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ… ఇది చట్టవిరుద్ధమైనది, ఏకపక్షమైనది మరియు తగని చర్య అని మండిపడ్డారు.

