పాఠకులను మెప్పిస్తున్న ఏఐ కథలు!

1
- Advertisement -

సాహిత్య రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశంపై గత కొన్నినెలలుగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఏఐ రాసిన పాఠ్యాలు నిజమైన రచయితల సృష్టిలాగే అనిపిస్తున్నాయా? సాధారణ పాఠకులు మానవులు రాసిన కథలకు ఏఐ రాసిన కథలకు తేడాను గుర్తించగలరా? అనే అంశంపై అమెరికాలోని విల్లానోవా యూనివర్సిటీ పరిశోధకులు ఒక ఆసక్తికరమైన అధ్యయనం నిర్వహించారు.

జడ్జిమెంట్ అండ్ డిసిషన్ మేకింగ్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం—పాఠకులు మానవ రచయితలు రాసిన కథల కంటే ఏఐ సృష్టించిన కథలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఒక కథ ఏఐ రాసిందని వారికి ముందుగానే తెలిస్తే మాత్రం దానికి తక్కువ మార్కులు ఇస్తూ నెగెటివ్ రేటింగ్ ఇస్తున్నారు.

విల్లానోవా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సిడ్నీ సియర్స్, డాక్టర్ డినా స్కోల్నిక్ వైస్‌బర్గ్ నేతృత్వంలో మొత్తం 2,587 మంది అమెరికన్లపై మూడు వేర్వేరు ప్రయోగాలను నిర్వహించారు. ప్రసిద్ధ సాహిత్య పత్రికల్లో ప్రచురితమైన మూడు కథలను అదే తరహా అంశాలపై ఓపెన్ ఏఐ కి చెందిన ‘చాట్‌జిపిటి 4.0’ తో రాయించిన మరో మూడు కథలను వీరికి చదవడానికి ఇచ్చారు.

థ ఏఐ రాసిందా లేక మనిషి రాసిందా అని చెప్పకుండా చదివించినప్పుడు మెజారిటీ పాఠకులు ఏఐ రాసిన కథలే అత్యుత్తమ నాణ్యతతో ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయని తేల్చారు. అయితే అదే కథను చూపుతూ ఇది మనిషి రాసిన కథ అని చెప్పినప్పుడు పాఠకులు దానికి ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. అంటే కథ ఏఐ రాసినప్పటికీ అది మనిషి సృష్టి అని భావిస్తేనే పాఠకులు ఎక్కువ అభిమానం చూపించారు.

మనిషి రాసిన కథ ఏదో…ఏఐ రాసిన కథ ఏదో సరిగ్గా చెప్పమని కోరగా… కేవలం 39% నుండి 52% మంది మాత్రమే సరైన సమాధానం చెప్పగలిగారు. అంటే చాలామందికి మనుషులు రాసిన దానికి, ఏఐ రాసిన దానికి తేడా కనిపెట్టడం సాధ్యం కాలేదు. కథనాలు చదవడానికి ఏఐ రచనలు ఎంతో సులువుగా, స్పష్టమైన భాషతో ఉన్నప్పటికీ, పాఠకులు మానవ సృష్టికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

Also Read:రాజ్యసభలో ఖర్గే సంచలనం!

మనుషులు రాసే రచనల్లో వారి వ్యక్తిగత అనుభవాలు, రక్తం, కన్నీళ్లు మరియు నిజమైన భావోద్వేగాలు దాగి ఉంటాయి. యంత్రాలు సృష్టించే పాఠ్యంలో భాషా నైపుణ్యం ఉన్నప్పటికీ ఆ సృజనాత్మక ఆత్మ ఉండదని భావిస్తారు. ఏఐ కేవలం డేటా ఆధారంగా పని చేస్తుంది తప్ప, దానికి స్వంత ఆలోచనలు లేదా అనుభవాలు ఉండవు. అందుకే ఏఐ రాసిందని తెలియగానే పాఠకులకు ఆ కథతో మానసిక అనుబంధం తెగిపోతుంది. చేతితో రాసిన ఉత్తరానికి, ప్రింట్ చేసిన కాగితానికి ఉండే తేడా లాగే… మనిషి పడిన శ్రమకే విలువ ఎక్కువ అని పాఠకులు భావిస్తారు.

- Advertisement -