భారతదేశంలో పొగాకు వినియోగం అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్యల్లో ఒకటి. చాలామంది పొగాకు అలవాటును మానేయాలని అనుకున్నప్పటికీ సరైన మార్గదర్శకత్వం లేక విఫలమవుతుంటారు. ఈ నేపథ్యంలో పొగాకు అలవాటు నుంచి సులభంగా బయటపడటానికి నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.
పొగాకు మాన్పించే మూడు చిట్కాలను చెబుతున్నారు నిపుణులు. అదే అడగడం (ask),సలహాలు ఇవ్వడం( Advise),అనుసంధానించడం( Connect). ఈ విధానం చాలా సరళమైనది. ఆసుపత్రికి లేదా క్లినిక్‌కు వచ్చే ప్రతి రోగితో వైద్యులు లేదా ఆరోగ్య సిబ్బంది క్రింది మూడు దశలను అమలు చేయాల్సి ఉంటుంది:
అడగడం…రోగి వద్దకు వచ్చినప్పుడు వారి ఆరోగ్య సమస్యలతో పాటు “మీరు ధూమపానం లేదా పొగాకు ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారా?” అని స్పష్టంగా అడిగి తెలుసుకోవడం.
సలహా ఇవ్వడం..ఒకవేళ వారు పొగాకు వాడుతున్నట్లయితే దానివల్ల కలిగే ఆరోగ్య ముప్పులను వివరించి, ఆ అలవాటును తక్షణమే మానేయడం ఎంత అవసరమో గట్టిగా, స్పష్టంగా సలహా ఇవ్వడం.
అనుసంధానించడం,..కేవలం “పొగాకు మానెయ్యండి” అని చెప్పి వదిలేయకుండా వారిని నేరుగా పొగాకు విముక్తి కేంద్రాలు , నేషనల్ క్విట్‌లైన్ హెల్ప్‌లైన్ నంబర్లు లేదా డిజిటల్ సహాయక సేవలతో అనుసంధానించడం.
సాధారణంగా రోగులకు “పొగాకు మానెయ్యండి” అని సలహా ఇచ్చి పంపడం కంటే, వారిని నేరుగా కౌన్సెలింగ్ సెంటర్లు లేదా క్విట్‌లైన్ సేవలతో కనెక్ట్ చేసినప్పుడు వారు ఆ అలవాటు నుంచి త్వరగా బయటపడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.భారతదేశంలో 25 కోట్లకు పైగా వయోజనులు సిగరెట్లు, బీడీలతో పాటు ఖైనీ, గుట్కా వంటి నమలే పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారు. దీనివల్ల నోటి క్యాన్సర్‌లు, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధుల ముప్పు పెరుగుతోంది.
Also Read:రాజ్యసభలో ఖర్గే సంచలనం!
భారత ప్రభుత్వం 2016 నుంచే ‘నేషనల్ టొబాకో క్విట్‌లైన్ సర్వీసెస్’ మరియు ఫోన్ ఎస్ఎమ్‌ఎస్ (SMS) ఆధారిత ‘mCessation’ ప్రోగ్రామ్‌లను నడుపుతోంది. ఎస్ఎమ్‌ఎస్ ఆధారిత సేవలను వాడిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు పొగాకును విజయవంతంగా మానెయ్యగలిగారు. అయితే ఈ ఉచిత సేవల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే పెద్ద ప్రతిబంధకంగా మారింది.

