ఉత్తరాఖండ్‌లోని రామ్‌లీలా మైదానంలో ఇటీవల జరిగిన తన బహిరంగ సభ అనంతరం అక్కడి ప్రాంగణాన్ని ‘శుద్ధీకరణ’ చేశారంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ రాజ్యసభ వేదికగా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వివక్షాపూరిత పరిస్థితులు ఎదురవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరాఖండ్ రామ్‌లీలా మైదానంలో తన ప్రసంగం పూర్తయిన రెండు రోజుల తర్వాత కొందరు వ్యక్తులు అక్కడ శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టారని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఆ రోజు జరిగిన ర్యాలీకి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారని, తాను ఏ కులాన్ని లేదా మతాన్ని ప్రస్తావించకుండా కేవలం ప్రజా సమస్యలపైనే మాట్లాడానని ఖర్గే స్పష్టం చేశారు.
ఈ శుద్ధీకరణ కార్యక్రమం వెనుక బీజేపీ కార్యకర్తల హస్తం ఉందని ఖర్గే నేరుగా ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు. ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తక్షణమే ఖండించారు. ఇటువంటి ఘటనలు చాలా దురదృష్టకరమని, బీజేపీ ఎలాంటి వివక్షతను లేదా ఇటువంటి కార్యక్రమాలను ఎప్పుడూ ప్రోత్సహించదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని నడ్డా సభకు హామీ ఇచ్చారు.
Also Read:బర్త్ టూరిజంపై అమెరికా కఠిన చర్యలు

