దేశంలో తొలిసారి..రైలుకు ఓ బ్రాండ్‌!

2
- Advertisement -

భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత వినూత్నమైన మార్పునకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలి ప్రైవేట్‌ రైలుగా పేరుగాంచిన ‘తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఇప్పుడు ఒక కార్పొరేట్ బ్రాండ్ పేరుతో కొత్త రూపు సంతరించుకుంది. లక్నో – న్యూఢిల్లీ మధ్య నడిచే ఈ ప్రీమియం తేజస్ ఎక్స్‌ప్రెస్‌ పేరును ఇకపై ‘స్ప్రైట్‌ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌’గా పిలవాలని నిర్ణయించారు.

రైల్వేలకు వచ్చే యేతర ఆదాయాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా ఐఆర్‌సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రముఖ కూల్ డ్రింక్ బ్రాండ్ ‘స్ప్రైట్’తో ఐఆర్‌సీటీసీ ఈ రవాణా బ్రాండింగ్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.ఈ ఒప్పందంలో భాగంగా తదుపరి ఆరు నెలల పాటు ఈ రైలుకు ‘స్ప్రైట్‌ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌’గా బ్రాండింగ్ హక్కులను కల్పించారు.

రైలు వెలుపలి కోచ్‌లపై మాత్రమే కాకుండా లోపలి భాగంలో ఉన్న డిస్‌ప్లేలు, సీట్ల హెడ్‌రెస్ట్ కవర్లు, పోస్టర్లతో పాటు ప్రయాణికులకు అందించే నాప్‌కిన్లు, సర్వీస్ ట్రేలపై కూడా ఈ బ్రాండ్‌ను ప్రదర్శించనున్నారు. దేశంలో ఒక రైలుకు అధికారికంగా ఒక ప్రైవేట్ వ్యాపార బ్రాండ్ పేరును జోడించడం ఇది మొదటిసారి. గతంలో కోచ్‌లపై అడ్వర్టైజ్‌మెంట్ పోస్టర్లు లేదా గ్రాఫిక్స్ వేసే సంప్రదాయం ఉన్నప్పటికీ, ఏకంగా ఒక రైలు పేరుతోనే బ్రాండ్ పేరును విలీనం చేయడం ఇదే ప్రథమం.

Also Read:బర్త్ టూరిజంపై అమెరికా కఠిన చర్యలు

2019లో ప్రారంభమైన లక్నో – ఢిల్లీ తేజస్ ఎక్స్‌ప్రెస్, ప్రైవేట్ ప్రాతిపదికన ఐఆర్‌సీటీసీ ద్వారా నిర్వహించబడుతున్న మొదటి విలాసవంతమైన రైలు. ఇప్పుడు తీసుకున్న ఈ బ్రాండింగ్ నిర్ణయం ద్వారా రైల్వే సంస్థలకు భారీ ఆదాయం సమకూరడమే కాకుండా, కార్పొరేట్ రంగానికి కొత్త ప్రచార వేదిక లభించినట్లయింది.

- Advertisement -