సీజేపీ నిరసనలో మహిళపై చేయి..పోలీస్‌పై వేటు!

2
- Advertisement -

పరీక్షల్లో అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన ‘ఛలో సంసద్’ మార్చ్‌లో ఓ మహిళా నిరసనకారురాలిపై చేయి చేసుకున్న ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారిని జంతర్ మంతర్ నిరసన స్థలం విధుల్లో నుంచి తొలగించారు.

జూలై 20న జంతర్ మంతర్ వద్ద వేలాది మంది సీజేపీ మద్దతుదారులు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో, నార్త్ ఈస్ట్ జిల్లా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) సందీప్ లాంబా ఓ మహిళా ఆందోళనకారురాలిపై చేయి చేసుకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ సాకేత్ గోఖలే స్పందిస్తూ.. సందీప్ లాంబాపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసుల హింసాత్మక చర్యలపై దాఖలైన పిటిషన్లపై నిన్న ఢిల్లీ హైకోర్టులో ప్రభుత్వం సమాధానమిస్తూ.. ఎఫ్‌ఐఆర్ కోసం ఎవరూ పోలీసులను సంప్రదించలేదని తెలిపింది. అందుకే ఈ రోజు నేను పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశాను అని సాకేత్ గోఖలే పేర్కొన్నారు.

సీజేపీ నిరసనకారులపై పోలీసులు మితిమీరిన బలాన్ని ఉపయోగించారని దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా సందీప్ లాంబా పేరును ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం ఎదుట పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ..ఏ తప్పూ చేయని, కదలకుండా నిలబడి ఉన్న ఒక మహిళను అడిషనల్ డీసీపీ సందీప్ లాంబా చెంపదెబ్బ కొట్టడం స్పష్టంగా కనిపించింది. దానికి సంబంధించిన వీడియోను నేను ఇప్పుడే చూపించగలను. ఖాకీ దుస్తుల్లో ఉన్న ఇటువంటి వ్యక్తుల పేర్లను వెల్లడించడానికి మనం భయపడకూడదు. ఆయనను ఇక్కడికి పిలిపించి, ఈ చర్యకు బాధ్యుడిగా చేసి విచారించాలి అని కోర్టును కోరారు.

Also Read:పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం

జనాన్ని చెదరగొట్టడానికి మొదట వాడాల్సిన వాటర్ క్యానన్లను అసలు ఉపయోగించలేదని, చిట్టచివరి ప్రత్యామ్నాయమైన టియర్ గ్యాస్ (బాష్పవాయువు) గోళాలను దూరంగా కాకుండా, నేరుగా నిరసనకారులపైకే విసిరారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై (PILs) స్పందించిన హైకోర్టు.. ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (NHRC) నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ నిరసనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్‌లతో సహా అన్ని రికార్డులను పకడ్బందీగా భద్రపరచాలని అధికారులను ఆదేశించింది.

- Advertisement -