జంతర్ మంతర్ వద్ద CJP చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే రామ్ మనోహర్ లోహియా (RML) ఆసుపత్రిని సందర్శించి….సోమవారం నాటి నిరసనలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎక్స్ (X) లో పోస్ట్ చేస్తూ.. దారుణమైన లాఠీఛార్జ్ సమయంలో తీవ్రంగా గాయపడిన ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉంది అని దీప్కే తెలిపారు.
సోమవారం నిరసన ప్రదేశంలో “రాళ్లతో నిండిన ట్రక్కులు” ఉండటంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న అక్కడ రాళ్లతో ఉన్న ట్రక్కులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ ఢిల్లీ పోలీసులు పక్షిని కూడా ఎగరనివ్వడం లేదు. మా సభ్యుల్లో ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తున్నారు, వారి బ్యాగ్‌లు, జేబులు సరిచూస్తున్నారు. బారికేడ్లతో దారులన్నీ మూసేశారు, ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు. అటువంటప్పుడు జంతర్ మంతర్ చుట్టూ రాళ్లతో ఉన్న ట్రక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? అని దీప్కే ప్రశ్నించారు.
నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ క్యానన్లను ఉపయోగించి ఉండవచ్చని అన్నారు. ఒకవేళ మార్చ్‌ను అడ్డుకోవాలనుకుంటే వారు వాటర్ క్యానన్లను ఉపయోగించి ఉండవచ్చు. చివరికి వారు కేవలం పిల్లలు మాత్రమే. 17-18 ఏళ్ల వయసున్న పిల్లలు. మేము ఇక్కడ నెల రోజులుగా శాంతియుతంగా కూర్చున్నాము అని చెప్పారు.
నిరసన తెలుపుతున్న విద్యార్థులకు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మంగళవారం తన మద్దతు తెలిపారు. సంఘర్షణల నీడలోనే నిజమైన స్వాతంత్ర్యం రూపుదిద్దుకుంటుంది, యువత నడిచే వైపే చరిత్ర మలుపు తిరుగుతుంది! ఆందోళన బాటలో ఉన్న విద్యార్థులు, బలమైన దేశం!” అని తివారీ ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు.
సోమవారం నిరసనకారులపై పోలీసుల చర్యను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మంగళవారం తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు “నిజమైన సమస్య” ఉందని ఆమె అన్నారు. యువతపట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. వారికి ఒక నిజమైన సమస్య ఉంది, ఆ సమస్య ఏంటో మనందరికీ తెలుసు. వారు చదువు కోసం డబ్బు ఖర్చు చేసిన ప్రతిసారీ, వారి తల్లిదండ్రులు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. కోచింగ్ సెంటర్లకు వెళ్తూ ఎన్నో రకాల శ్రమలు పడుతున్నారు. తమకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో వారు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు అని ప్రియాంక గాంధీ అన్నారు.
Also Read:లోక్‌సభ ముందుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సవరణ బిల్లు!

