పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభలో ‘సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026’ పరిశీలన మరియు ఆమోదం కోసం రానుంది. కేంద్ర న్యాయ మరియు రక్షణ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మరుసటి రోజే ఇది చర్చకు వస్తోంది. 1956 నాటి సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును పరిశీలించి ఆమోదించాలని ఆయన సభను కోరనున్నారు.
ఈ శాసన ప్రక్రియకు ముందు మే 16, 2026న రాష్ట్రపతి జారీ చేసిన సుప్రీంకోర్టు ఆర్డినెన్స్‌ను నిరాకరిస్తూ టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్, ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్.కే. ప్రేమచంద్రన్ మరియు కాంగ్రెస్ ఎంపీ డీన్ కురియాకోస్ ప్రవేశపెట్టిన చట్టబద్ధమైన తీర్మానాన్ని సభ పరిశీలించనుంది. ఈ రెండింటినీ కలిపి చర్చించనున్నారు.
మంగళవారం నాటి సభ కార్యకలాపాల జాబితాలో ప్రశ్నోత్తరాలు, పత్రాల సమర్పణ, పార్లమెంటరీ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు మరియు రూల్ 377 కింద ఇతర అంశాలు ఉన్నాయి. 18వ లోక్‌సభ 7వ సమావేశాల సందర్భంగా ఉభయ సభలు ఆమోదించి.. రాష్ట్రపతి అంగీకారం పొందిన తొమ్మిది బిల్లుల జాబితాను సెక్రటరీ జనరల్ సభ ముందు ఉంచుతారు.
దీంతో పాటు గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన నివేదికలను, అలాగే పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ రంగానికి సంబంధించిన గ్రాంట్ల డిమాండ్ల నివేదికలను కూడా సభ పరిశీలిస్తుంది. అలాగే ఇతర వెనుకబడిన తరగతుల (OBC) సంక్షేమ కమిటీకి 20 మంది లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి బీజేపీ ఎంపీలు గణేష్ సింగ్, రోడ్‌మల్ నాగర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిటీలో భాగస్వామ్యం కావడం కోసం రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను ఎన్నుకోవాలని కోరుతూ మరొక తీర్మానాన్ని కూడా ప్రవేశపెడతారు.
మరోవైపు రాజ్యసభలో ‘జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే (సవరణ) బిల్లు, 2026’ ప్రవేశపెట్టడానికి, అనంతరం పరిశీలించి ఆమోదించడానికి ప్రతిపాదించబడింది. 1971 నాటి జాతీయ గౌరవ నిరోధక చట్టాన్ని సవరించి, వందేమాతరాన్ని పరిరక్షించే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ అనుమతి కోరనున్నారు.
Also Read:శ్రీ విష్ణు..’కామ్రేడ్ కళ్యాణ్’
వర్షాకాల సమావేశాల తొలిరోజే నీట్ పేపర్ లీక్, విద్యార్థుల సమస్యలు మరియు రామ్ మందిర్ ట్రస్ట్ విరాళాల నిధుల అక్రమ వినియోగం వంటి అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనల వల్ల ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.

