‘ఆత్మనిర్భర్ భారత్’ చొరవకు మరింత బలాన్ని చేకూరుస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు యొక్క ప్రత్యేకతలు మరియు దాని ప్రాముఖ్యతను వివరించారు. దేశీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇదొక చారిత్రాత్మక విజయమని అభివర్ణించిన మంత్రి, ఈ రైలుకు సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్ (గమన వ్యవస్థ) మరియు సాంకేతికత మొత్తం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డాయని హైలైట్ చేశారు.
హైడ్రోజన్ అనేది ఒక సరికొత్త ఇంధనం, సరికొత్త శక్తి వనరు. రవాణా రంగంలో ఈ ఇంధనాన్ని ఎలా ఉపయోగించాలి…ఆ సాంకేతికతను భారతదేశంలో ఎలా అభివృద్ధి చేయాలి మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద దీనిని స్వదేశీ సాంకేతికతగా మార్చడం చాలా ముఖ్యం. ఈ రోజు రైల్వే శాఖకు ఇదొక అతిపెద్ద మైలురాయి, ఎందుకంటే ఈ సాంకేతికత మొత్తం భారతదేశంలోనే అభివృద్ధి చేయబడింది మరియు దీని మేధో సంపత్తి హక్కులు భారతదేశానికే చెందుతాయి అన్నారు.
ఎటువంటి కాలుష్య ఉద్గారాలను విడుదల చేయని (జీరో-ఎమిషన్) ఈ రైలు వెనుక ఉన్న సాంకేతిక విధానాన్ని వివరిస్తూ, ఈ వ్యవస్థ నీటిని శక్తిగా మారుస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు. “నీటి నుండి హైడ్రోజన్ తయారు చేయబడుతుంది; దీని కోసం సమీపంలో ఒక ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది. నీటి నుండి ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్‌ను, ఈ ఫ్యూయల్ సెల్ (ఇంధన ఘటం) ద్వారా తిరిగి విద్యుత్‌గా మారుస్తారు. ఆ విద్యుత్‌ను మోటార్లను నడపడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ప్రాథమికంగా, హైడ్రోజన్ ఉత్పత్తి నుండి మోటారులో దాని వాస్తవ వినియోగం వరకు ఈ పూర్తి గమన వ్యవస్థకు సంబంధించిన అన్ని ఐపి (IP) హక్కులు ఈ రోజు భారతదేశం వద్దే ఉన్నాయి,” అని ఆయన చెప్పారు.
హైడ్రోజన్ వినియోగంపై ఉన్న భద్రతా ఆందోళనల గురించి మంత్రి స్పందిస్తూ…ఈ రైలు అంతర్జాతీయంగా కఠినమైన పరీక్షలకు గురైందని భరోసా ఇచ్చారు. చాలా కాలం పాటు అత్యంత సమగ్రమైన భద్రతా అంచనా పరీక్షలు నిర్వహించబడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సేఫ్టీ అసెస్మెంట్ ఏజెన్సీలలో ఒకటైన ‘TUV SUD’ ద్వారా స్వతంత్ర భద్రతా అంచనా వేయబడింది. అన్ని విధాలుగా ఈ రైలు పూర్తిగా సురక్షితమైనది అని ఆయన స్పష్టం చేశారు.
హైడ్రోజన్ పవర్డ్ రైలు ముఖ్య విశేషాలు..
పవర్ సిస్టమ్: ఇది 1200 kW హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా నడిచే 10-కార్ల హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు సెట్.
వేగం మరియు సామర్థ్యం: ఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిమీ వేగంతో నడవడానికి అనుమతి పొందింది (దీని డిజైన్ వేగం గంటకు 110 కిమీ). ఇది సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
సాంకేతికత: హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికత అనేది హైడ్రోజన్‌ను ఉపయోగించి రసాయన చర్య ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రధాన శక్తి వనరు ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ (PEMFC). ఇది పెర్ఫ్లోరోసల్ఫోనిక్ యాసిడ్ (PFSA) పాలిమర్ మెంబ్రేన్ అంతటా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల రసాయన చర్య ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో బై-ప్రొడక్ట్స్ (ఉప-ఉత్పత్తులు) గా కేవలం నీటి ఆవిరి మరియు వేడి మాత్రమే విడుదలవుతాయి.
ఇంధన సామర్థ్యం: డీజిల్ (43 MJ/Kg) తో పోలిస్తే హైడ్రోజన్ అనేది 120 MJ/Kg (మెగాజూల్స్ పర్ కిలోగ్రామ్) తో అత్యధిక శక్తిని ఇచ్చే ఇంధనం. దీనికి నిర్వహణ ఖర్చు (Maintenance) తక్కువ మరియు కార్బన్ ఫుట్‌ప్రింట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రైలు రవాణాకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత స్వచ్ఛమైన ప్రొపల్షన్ సాంకేతికతగా నిలుస్తుంది.
దీనికి మద్దతుగా, భారతీయ రైల్వే ప్రత్యేక మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ హైడ్రోజన్ రైలు కేవలం ఒక కొత్త రైలును పరిచయం చేయడం మాత్రమే కాదు, భవిష్యత్తులో హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలకు అవసరమైన వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు మరియు సంస్థాగత సామర్థ్యాన్ని కూడా ఇది నిర్మిస్తుంది.

