తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు ముందుగా జూలై 25న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.
ఆలయ పవిత్రత పరిరక్షణకే పవిత్రోత్సవాలు ఏడాది పొడవునా ఆలయంలో జరిగే నిత్యార్చనలు, ఉత్సవాలు, కైంకర్యాల్లో తెలియక సంభవించిన దోషాలకు పరిహారంగా, ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు శైవాగమ శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల ద్వారా ఆలయంలో ఆధ్యాత్మిక శోభ మరింత వృద్ధి చెందుతుంది.
మూడు రోజుల విశేష కార్యక్రమాలు
జూలై 26 (మొదటి రోజు):
ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది.
జూలై 27 (రెండో రోజు):
ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాల పూజ, హోమం నిర్వహిస్తారు.
జూలై 28 (మూడో రోజు):
ఉదయం మహాపూర్ణాహుతి, కలశోద్ధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారు, శ్రీ చండికేశ్వరస్వామివారు ఆలయ పురవీధుల్లో భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు.
Also Read:హోర్ముజ్ జలసంధి..కేంద్రం కీలక ఆదేశాలు
భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పవిత్రోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని టిటిడి కోరుతోంది.

