మద్యంపై పన్నుల తగ్గింపు..ఒత్తిడిలో కాంగ్రెస్!

0
- Advertisement -

కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర సందిగ్ధంలో పడింది. రాష్ట్రంలో విదేశీ మద్యం (IMFL) పై ఉన్న పన్నులను తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వస్తున్న వార్తలు.. అటు ప్రతిపక్షాల నుండి, ఇటు సామాజిక, మతపరమైన సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి. మద్యపాన నిరోధాన్ని తమ ప్రధాన అజెండాగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ…ఇప్పుడు ఆదాయం కోసం పన్నులు తగ్గించాలని చూడటం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది.

కేరళలో దేశంలోనే అత్యధికంగా మద్యంపై పన్నులు ఉన్నాయి. ఇక్కడ విదేశీ మద్యంపై దాదాపు 241 శాతం నుండి 251 శాతం వరకు పన్ను విధిస్తున్నారు.దీనివల్ల పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మరియు పుదుచ్చేరి (మాహే ప్రాంతం) లతో పోలిస్తే కేరళలో మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
పన్నులు ఎక్కువగా ఉండటం వల్ల సరిహద్దు ప్రాంతాల నుండి మద్యం అక్రమ రవాణా (స్మగ్లింగ్) ఎక్కువైంది.

దీనికి తోడు పన్నుల భారం భరించలేక రాష్ట్రంలో మద్యం అమ్మకాలు క్షీణించి, ప్రభుత్వానికి రావాల్సిన ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ ఆర్థిక లోటును పూడ్చుకోవడానికే పన్నులను కొంతమేర తగ్గించి, అమ్మకాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదన బయటకు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై నలుమూలల నుండి విమర్శలు వ్యూహత్మకంగా ముంచెత్తాయి.

ప్రతిపక్షమైన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ఈ అంశాన్ని రాజకీయాస్త్రంగా మార్చుకుంది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు మద్యం దుకాణాల వేళలు మార్చినా, పన్నుల గురించి మాట్లాడినా “లిక్కర్ మాఫియాతో చేతులు కలిపారు” అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారని ఎల్‌డిఎఫ్ గుర్తు చేస్తోంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం లిక్కర్ లాబీ ఒత్తిళ్లకు లొంగిపోయి పన్నులు తగ్గించడానికి సిద్ధమైందని ఎద్దేవా చేస్తోంది.

Also Read:TMC:ఈసీ ముందుకు టీఎంసీ సంక్షోభం!

కేరళ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన ‘కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్’ (KCBC) మద్యపాన వ్యతిరేక సమితి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పన్నులు తగ్గిస్తే మద్యపానం మరింత పెరుగుతుందని ఇది కుటుంబాలను రోడ్డున పడేస్తుందని చర్చి వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేరళలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన క్రైస్తవ సమాజం విముఖత చూపడం కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగించే విషయమే. ఈ నిర్ణయం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని కాంగ్రెస్ లోని ఒక వర్గం నేతలు భయపడుతున్నారు. మద్య నియంత్రణ అనే ఆదర్శానికి కట్టుబడి ఉండాలా? లేక ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి పన్నులు తగ్గించాలా? అనే విషయంలో పార్టీ సీనియర్ నేతల మధ్య భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఎన్నికల హామీల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముళ్లబాటలో ఎలా ముందుకు సాగుతుందనేది ఇప్పుడు కేరళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

- Advertisement -