Uddhav Vs Shinde:ఇది ట్రైలరే!

2
- Advertisement -

శివసేన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే….శివసేన (యుబిటి) వర్గం నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. తన వర్గాన్ని బలహీనపరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఏకనాథ్ అనగా…. విచ్ఛిన్నమైన శివసైనికుడిని చూడాలని కొందరు భావించి ఉండవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగలేదని ఉద్ధవ్ అన్నారు. శివసేన 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో ఇరు వర్గాలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించడం గమనార్హం.

ర్యాలీని ఉద్దేశించి శుక్రవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, షిండే వర్గ నేత ఏకనాథ్ షిండే మాట్లాడుతూ… శివసేన 60వ వ్యవస్థాపక దినోత్సవం వేళ ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి కానీ మీ అందరి కోసం ఇక్కడ ఒక పులి నిలబడి ఉంది. అవి గుంపులుగా మొరుగుతాయి కానీ పులి ఎప్పుడూ ఒంటరిగానే వస్తుంది. అదే శివసేన. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే….అసలు సినిమా ఇంకా ముందుంది. ఏం జరుగుతుందో వేచి చూడండి అన్నారు.

ఈ సందర్భంగా ఏకనాథ్ షిండే మాట్లాడుతూ… శివసేన అందరికీ చెందిందని…ఇది సామాన్య ప్రజల పార్టీ అని అన్నారు. శివసైనికులందరూ లేచి నిలబడి…ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం కోసం చేసిన అసాధారణ కృషిని కొనియాడుతూ చప్పట్లు కొట్టాలని నేను కోరుతున్నాను. దేశం కోసం ప్రధాని మోదీ చేస్తున్న పనిని చూసి బాలాసాహెబ్ ఠాక్రే కూడా ఆయన వీపు తట్టి అభినందించేవారు అని చెప్పారు.

మరోవైపు శివసేన 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ ఠాక్రే… ఏకనాథ్ షిండేకి కౌంటర్ ఇస్తూ…ఒక కుంగిపోయిన శివసైనికుడిని చూడాలని కొందరు ఆశించి ఉండవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగలేదని అన్నారు. “ఈ రోజు ఈ నలుగురు పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలందరూ ఇక్కడకు వచ్చారు. మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? నా ప్రాణాన్ని త్యాగం చేసినా అది సరిపోదు. గత 60 ఏళ్లలో మనం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నాం…మనవాళ్లు జైళ్లకు వెళ్లారు, రక్తాన్ని నీళ్లలా చిందించారు అని ఉద్ధవ్ అన్నారు.

శివసేనను కాంగ్రెస్‌లో విలీనం చేయడం గురించి కొందరు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇంతకాలం బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ పార్టీ బీజేపీలో విలీనం కాలేదు. శివసేన కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని వారు అంటున్నారు కానీ చివరకు బీజేపీనే ఆ షిండే వర్గంలో విలీనం కాకుండా ఉంటే అదే చాలు అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలందరూ బయటి నుంచి వచ్చినవారే… మీకు సొంత కొడుకులు లేకపోతే మా పిల్లలను లాక్కుంటారా? ఉద్ధవ్ ఎవరినీ కలవడని… ఆదిత్యనే ప్రజలను కలవాలని వారు అంటున్నారు… నేను ప్రజలను కలవకపోతే మరి మీరు ఎలా గెలిచారు? మీ కోసం నేను ఎన్ని ర్యాలీలు నిర్వహించానో గుర్తుంచుకోండి అని ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా సమాధానమిచ్చారు.

Also Read:KTRను కలసిన TSEA ప్రతినిధులు

- Advertisement -