‘క్రాస్ ఓటింగ్’..ఇండియా కూటమిలో చిచ్చు!

2
- Advertisement -

జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలవ్వడం…ఆ ఓటమికి తమ పార్టీ ఎమ్మెల్యేల ‘క్రాస్ ఓటింగ్‌’ కారణమంటూ కాంగ్రెస్ ఆరోపించడంపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా (INDIA) కూటమిలో కీలక నేత… సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఘాటైన లేఖ రాశారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన ఒక దురుద్దేశపూరితమైన అబద్ధం గా కొట్టిపారేశారు.

జూన్ 18న జార్ఖండ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా ఓటమికి మా ఎమ్మెల్యేలే కారణమంటూ కాంగ్రెస్ నిందించడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది ముమ్మాటికీ అబద్ధం. ప్రతిపక్ష ఎమ్మెల్యేల సమావేశంలో అనుకున్న ప్రణాళిక ప్రకారమే మా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రణవ్ ఝాకు ఓటు వేశారు. వారు బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేయడానికి ముందే మా పోలింగ్ ఏజెంట్లు ఆ ఓట్లను ధృవీకరించారు అని భట్టాచార్య లేఖలో స్పష్టం చేశారు.

ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుండి తమ పార్టీ అత్యంత నిబద్ధత గల భాగస్వామిగా ఉందని గుర్తుచేసిన ఆయన, ఇలాంటి నిరాధారమైన ఆరోపణల వల్ల కూటమి పార్టీల మధ్య పరస్పర విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. మీడియాలో ఈ అబద్ధానికి విస్తృత ప్రచారం లభించినందున తాము ఈ లేఖను బహిరంగం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

జార్ఖండ్‌లో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అభ్యర్థి, మాజీ మంత్రి బైద్యనాథ్ రామ్ గెలుచుకున్నారు. అయితే రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి, ఖర్గే కార్యాలయ కార్యదర్శి అయిన ప్రణవ్ ఝాపై ఎన్‌డీఏ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ పరిమల్ నత్వాని విజయం సాధించడంతో కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది.

Also Read:Stock crash:ఐటీ షేర్లు..ఢమాల్

81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఒక రాజ్యసభ స్థానాన్ని గెలవడానికి 28 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. జేఎమ్‌ఎమ్ నేతృత్వంలోని కూటమికి 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. క్రాస్ ఓటింగ్ జరగకపోయి ఉంటే కూటమికి చెందిన ఇద్దరు అభ్యర్థులు సులభంగా గెలిచేవారు. కానీ తుది ఫలితాల్లో బైద్యనాథ్ రామ్‌కు 30 ఓట్లు, నత్వానికి 30 ఓట్లు రాగా (రెండు ఓట్లు చెల్లనివిగా తేలాయి), కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కేవలం 21 ఓట్లు మాత్రమే సాధించగలిగారు (ఒక ఓటు చెల్లలేదు).

- Advertisement -