అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశవిదేశాల నుండి భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల విరాళాల నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రతిపక్షాలే కాకుండా, స్థానిక అధికార పార్టీ (బీజేపీ) నేతలు కూడా గళం విప్పడం రాజకీయంగా, సామాజికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తూ సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
ఈ నిధుల దారిమళ్లింపు వ్యవహారంపై బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. రామాలయ నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో తనకు పూర్తిగా తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిధుల కుంభకోణం వెనుక కొందరు బడా నాయకుల హస్తం ఉంది. ఆ పెద్దల పేర్లు ఉన్నందు వల్లే నేను పూర్తి వివరాలను బయటపెట్టలేకపోతున్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
స్థానికుల నుండి వస్తున్న ఆరోపణలు ఈ నిధుల దుర్వినియోగం నిజమేననే అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. విరాళాల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఆలయ సిబ్బంది ఆర్థిక పరిస్థితి రాత్రికి రాత్రే మారిపోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు. విరాళాల లెక్కింపు విధుల్లో ఉన్న ఒక సాధారణ సిబ్బంది, లెక్కింపు పూర్తయిన కొద్దిరోజుల్లోనే కోట్ల రూపాయల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Also Read:తనపై జరిగిన దాడి..విన్యాసమే:అభిజిత్
విరాళాల లెక్కింపునకు ముందు, ఆ తర్వాత సదరు సిబ్బంది జీవన ప్రమాణాలు, ఆర్థిక వనరులు ఊహించని స్థాయికి పెరగడంపై స్థానికులు పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం కావడం పైగా స్వపార్టీ నేతలే ఆరోపణలు గుప్పించడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈ అవినీతి ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆలయ విరాళాల రికార్డులు, బ్యాంక్ ఖాతాలు, నిధుల లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది ఆర్థిక లావాదేవీలపై సిట్ లోతుగా దర్యాప్తు చేయనుంది. రెండు వారాల వ్యవధిలోనే ఈ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సిట్ అధికారులను ఆదేశించారు.

