ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు 2020-2030 ఒక ‘నష్టపోయిన దశాబ్దం’గా మిగలనుందని ప్రపంచ బ్యాంక్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన సంక్షోభం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,యుద్ధాలు , స్థిరమైన ద్రవ్యోల్బణం మరియు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వడ్డీ రేట్లు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంది.
గత మూడు దశాబ్దాలతో పోలిస్తే ప్రస్తుత దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అత్యంత నెమ్మదిగా సాగుతోందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ముఖ్యంగా పేద మరియు మధ్య ఆదాయ దేశాలలో పెట్టుబడులు క్షీణించడం, ఉపాధి అవకాశాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపు 60% పైగా దేశాలు ప్రస్తుతం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయాయి లేదా అప్పులు తీర్చలేని క్లిష్ట స్థితికి చేరువలో ఉన్నాయి. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఈ దేశాలు తమ బడ్జెట్‌లో ఎక్కువ భాగాన్ని అభివృద్ధి పనులకు కాకుండా, పాత అప్పుల వడ్డీలు చెల్లించడానికే కేటాయించాల్సి వస్తోంది.
గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పేదరికం తగ్గుకుంటూ వచ్చినప్పటికీ, ఈ దశాబ్దంలో ఆ వేగం పూర్తిగా మందగించింది. ఆర్థిక వృద్ధి లేకపోవడం వల్ల లక్షలాది మంది ప్రజలు తిరిగి పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది. సకాలంలో సరైన విధానపరమైన సంస్కరణలు మరియు అంతర్జాతీయ మద్దతు లభించకపోతే, ఈ దశాబ్దం ముగిసేసరికి అనేక వెనుకబడిన దేశాలు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తింటాయి. ఇది కేవలం ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు, మానవాభివృద్ధి సంక్షోభంగా మారుతుంది అని నిపుణులు హెచ్చరించారు.
Also Read:రోజు పదివేల అడుగులు నడుస్తున్నారా?
అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పాత ఆర్థిక విధానాలను మార్చుకుని, నిర్మాణాత్మక సంస్కరణలు చేపడితేనే ఈ నష్టపోయిన దశాబ్దం ముద్ర నుండి తప్పించుకోగలవని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది.

