ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ‘జనతా దర్శన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వందలాది మంది ప్రజలను ఆయన స్వయంగా కలుసుకుని, వారి సమస్యలను మరియు వినతులను ఓపికగా ఆలకించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడికక్కడే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అప్పగిస్తూ.. ప్రతి ఒక్కరి సమస్యను అత్యంత పారదర్శకంగా, గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
జనతా దర్శన్‌కు వచ్చిన వారిలో భూ వివాదాలు, పోలీసుల వేధింపులు మరియు పరిపాలనాపరమైన సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. సీఎం యోగి ఈ విషయాలపై స్పందిస్తూ.. ఏ ఒక్క పేదవాడికి లేదా బలహీన వర్గాల వారికి అన్యాయం జరగడానికి వీల్లేదని అధికారులను హెచ్చరించారు.
ఎవరైనా బలవంతంగా ఇతరుల భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధితులందరికీ సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని, పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.
Also Read:తెలంగాణను కాపాడుకుందాం!
ఈ వినతుల కార్యక్రమంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ పలువురు బాధితులు ముఖ్యమంత్రిని ఆశ్రయించారు. దీనిపై సీఎం యోగి మానవీయ కోణంలో స్పందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్య సహాయ నిధుల విడుదలకు ఎలాంటి ఆలస్యం జరగకూడదని…నిరుపేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశిస్తూ బాధితులకు ధైర్యం చెప్పారు.

