భారతదేశ విదేశీ మారక నిల్వలను (Forex Reserves) కాపాడుకోవడానికి మరియు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ఒక కీలకమైన విజ్ఞప్తి చేశారు. భారతీయుల ఇళ్లలో, లాకర్లలో ఉపయోగించకుండా పడి ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ ప్రక్రియ వైపు మళ్లించాలని ఆయన కోరారు. దీనివల్ల దేశీయంగా బంగారం లభ్యత పెరిగి, విదేశాల నుండి చేసే భారీ దిగుమతులు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారతదేశం ఒకటి. ప్రతి సంవత్సరం మన దేశం వందల టన్నుల బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దీనికోసం బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ కరెన్సీని వెచ్చించాల్సి వస్తోంది. బంగారం దిగుమతుల కోసం భారీగా నిధులు తరలిపోవడం వల్ల దేశ ‘కరెంట్ అకౌంట్ లోటు’ (CAD) పెరుగుతోంది.
విదేశీ మారక నిల్వలు కరిగిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువపై ఒత్తిడి పడుతోంది. భారతీయ కుటుంబాల వద్ద మరియు మతపరమైన సంస్థల (ట్రస్టుల) వద్ద దాదాపు 22,000 నుండి 25,000 టన్నుల బంగారం నిరుపయోగంగా నిల్వ ఉందని అంచనా. ఈ భారీ నిల్వలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే..దేశానికి బంగారంలో స్వయంసమృద్ధి లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
మన ఇళ్లలో ఉన్న బంగారం కేవలం ఒక ఆస్తిగా లాకర్లలో ఉండిపోకూడదు. దానిని రీసైక్లింగ్ చేయడం ద్వారా దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం చేయాలి. దీనివల్ల దేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా, ప్రజలకు కూడా తమ బంగారంపై సురక్షితమైన ఆదాయం లభిస్తుంది. ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల ద్వారా రీసైకిల్ చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్’ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పథకం కింద..ప్రజలు తమ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు.
Also Read:తెలంగాణను కాపాడుకుందాం!
ఆ బంగారంపై ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్దిష్ట వడ్డీని చెల్లిస్తుంది.
గడువు ముగిసిన తర్వాత బంగారం విలువకు సమానమైన నగదును లేదా తిరిగి శుద్ధి చేసిన బంగారాన్ని పొందవచ్చు.
ఈ రీసైక్లింగ్ విధానం వల్ల అటు ప్రజలకు వడ్డీ రూపంలో లాభం చేకూరడమే కాకుండా, ఇటు దేశానికి విదేశీ దిగుమతుల భారం తగ్గి ఆర్థిక భద్రత లభిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

