ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో తలపడనున్న సీనియర్ భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడానికి ఎంతో సమయం పట్టదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ సీనియర్ భారత జట్టులోకి వచ్చే అవకాశంపై మాట్లాడారు. భారత క్రికెట్ అభిమానులందరి నిరీక్షణకు సమాధానమిస్తూ…ఈ 15 ఏళ్ల కుర్రాడు త్వరలోనే సీనియర్ టీమ్ జెర్సీలో కనిపిస్తాడని సైకియా ధృవీకరించారు.
సూర్యవంశీ తన ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2026లో అతను ఒక అద్భుతమైన సీజన్‌ను ఆడాడు, ఇందులో 16 మ్యాచ్‌లలో 237.31 స్ట్రైక్ రేట్‌తో 72 సిక్సర్లు, 63 ఫోర్లతో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ అద్భుతమైన సీజన్ లో అతను క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టడంతో పాటు పలు ఇతర రికార్డులను కూడా తిరగరాశాడు.
టి20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు గాను సీజన్ ముగిసే సమయానికి అతను ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఈ బ్యాటర్‌ను శ్రీలంక-ఎ, ఆఫ్ఘనిస్తాన్-ఎ జట్లతో జరిగే వన్డే త్రైపాక్షిక సిరీస్ కోసం భారత్-ఎ జట్టులోకి ఎంపిక చేశారు. జూన్ చివరి వారంలో భారత జట్టు యూకే (UK) పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, అక్కడ ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్‌లతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ ల కోసం వైభవ్‌ను సీనియర్ జట్టులోకి తీసుకోవాలని పలువురి నుండి డిమాండ్లు వస్తున్నాయి.
Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

