కోల్‌కతా మెస్సీ విగ్రహం తొలగింపు

4
- Advertisement -

కోల్‌కతాలోని అత్యంత రద్దీగా ఉండే వీఐపీ రోడ్డు, లేక్ టౌన్ జంక్షన్ వద్ద ప్రతిష్టించిన అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహాన్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) అధికారులు తొలగించారు. రాబోయే వర్షాకాలం, ఈదురుగాలుల నేపథ్యంలో ఈ భారీ నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందన్న స్థానికుల ఫిర్యాదుల మేరకు విగ్రహాన్ని డీకన్‌స్ట్రక్ట్ (విడిభాగాలుగా) చేసి తరలించారు. అయితే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) సుదీర్ఘ పాలన ముగిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది వారాల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఐరన్ ఫ్రేమ్‌వర్క్, ఫైబర్‌గ్లాస్‌తో నిర్మించిన ఈ భారీ విగ్రహం…2022 ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని మెస్సీ చేతబట్టుకున్నట్లుగా ఉంటుంది. ఈ విగ్రహం ప్రమాదకరంగా ఉందని లేక్ టౌన్ నివాసితులు పీడబ్ల్యూడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విగ్రహం ఒక భూగర్భ పాదచారుల మార్గం (సబ్‌వే) పైభాగంలో ఉండటంతో రాబోయే వర్షాకాలంలో ఇది కూలిపోతే భారీ ప్రాణనష్టం సంభవిస్తుందని ఇంజనీర్లు నిర్ధారించారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ బృందాలు,.. 40 టన్నుల భారీ హైడ్రాలిక్ క్రేన్లతో రంగంలోకి దిగాయి. మొదట విగ్రహాన్ని భారీ నైలాన్ తాడులతో బంధించి, ఆపై గ్యాస్ కట్టర్ల సహాయంతో విగ్రహం కాలి భాగాల వద్ద ఉన్న ఐరన్ జాయింట్లను కట్ చేసి సురక్షితంగా కిందకు దించారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా తొలగించట్లేదని భద్రతా ప్రమాణాల ప్రకారం దీని బేస్ (సిమెంట్ దిమ్మె) ఎత్తును 20 అడుగుల నుండి 5 అడుగులకు తగ్గించి..ఎకో పార్క్ లేదా రవీంద్ర సరోవర్ ప్రాంతానికి తరలించే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Also Read:టాలీవుడ్‌పై జాన్వీ ఇంట్రెస్టింగ్!

డిసెంబర్ 2025 లో మెస్సీ స్వయంగా తన GOAT ఇండియా టూర్ సందర్భంగా ఈ విగ్రహాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అయితే కేవలం 40 రోజుల్లోనే అత్యంత వేగంగా నిర్మించిన ఈ విగ్రహం నాణ్యతా ప్రమాణాల పరంగా అప్పట్లోనే విమర్శలు ఎదుర్కొంది. పైగా ఆ సమయంలో సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మెస్సీ ఈవెంట్ భారీ నిర్వహణ లోపాలు, టికెట్ల అక్రమ విక్రయాలు మరియు అభిమానుల ఘర్షణలతో తీవ్ర వివాదాస్పదమైంది.

- Advertisement -