భారత్‌కు సీజేపీ చీఫ్ అబిజీత్

3
- Advertisement -

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే భారత్‌కు రానున్నారు. తాను జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందిన సీజేపీ కూటమిని స్థాపించిన తర్వాత దీప్కే భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి.

నేను భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను. అవును, మా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేయడానికి నేను నా దేశానికి, నా ఇంటికి, భారతదేశానికి వస్తున్నాను. పేపర్ లీకేజీల కారణంగా నీట్ (NEET) విద్యార్థులు కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం, లక్షలాది మంది విద్యార్థుల కష్టం వృథా కావడంపై గత కొన్ని రోజులుగా మనం సోషల్ మీడియాలో గళం విప్పుతున్నాం. దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం చూపిన మార్గంలో మనమందరం ఏకమై, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ శాంతియుతంగా మన గళాన్ని వినిపించాల్సిన సమయం వచ్చింది. మనమందరం కలిసికట్టుగా అడిగితే, వారు ఖచ్చితంగా వినాల్సిందేనన్నారు. నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం, ఇటీవలి సీబీఎస్ఈ (CBSE) పరీక్షా ఫలితాల చుట్టూ ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ… ఈ వ్యవస్థ వల్ల కోటి మందికి పైగా విద్యార్థులు నష్టపోయారని…వారి భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారని దీప్కే ఆరోపించారు.

ఇంత పెద్ద తప్పు జరిగిన తర్వాత కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే ఈ దేశంలో జవాబుదారీతనం అనేది లేకుండా పోయిందని అర్థం. ఈ వ్యవస్థ ఎన్ని తప్పులైనా చేయవచ్చు, దానికి ఎలాంటి పరిణామాలు ఉండవు అన్నట్లుగా ఉంది. కానీ ఆ తప్పుల ఫలితాన్ని మాత్రం విద్యార్థులే అనుభవించాల్సి వస్తోంది అన్నారు.

Also Read:పెరిగిన ఊబకాయం..తగ్గిన బాల్య వివాహాలు!

తాను భారతదేశంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేయవచ్చని తన తల్లిదండ్రులు భయపడుతున్నారని అయితే అధికారులు శాంతియుత నిరసనకు అనుమతిస్తారని ఆశిస్తున్నానని సీజేపీ వ్యవస్థాపకుడు పేర్కొన్నారు. నేను జైలుకు వెళ్తానేమోనని నా స్నేహితులు, కుటుంబ సభ్యులు భయపడుతున్నారు కానీ మన దేశం ఒక ప్రజాస్వామ్య దేశమని, శాంతియుతంగా నిరసన తెలపడానికి మనకు అనుమతి లభిస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. నేను గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్, నెహ్రూల గొప్ప అభిమానినని, ప్రజాస్వామ్యంలో మన గళాన్ని వినిపించే హక్కును కల్పించే భారత రాజ్యాంగాన్ని నేను అన్నింటికంటే మిన్నగా నమ్ముతానని స్పష్టం చేయాలనుకుంటున్నాను అని చెప్పారు.

- Advertisement -