రజత్ పటిదార్..ధోని, రోహిత్‌లను మించి!

5
- Advertisement -

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో రజత్ పటిదార్ అరుదైన ఫీట్ సాధించాడు. బెంగళూరు జట్టును కేవలం టైటిల్ కోసం పోటీపడే స్థాయి నుండి వరుసగా ఐపీఎల్ ట్రోఫీలు గెలిచే స్థాయికి నడిపించాడు. 2025లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి పటిదార్ ఈ ఫ్రాంచైజీకి ఒక నిశ్శబ్ద విప్లవంలా మారాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కెప్టెన్సీలోనూ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. గత రెండేళ్లుగా ఆర్‌సీబీ తిరుగులేని శక్తిగా ఎదగడంలో అతనే మూలస్తంభంగా నిలిచాడు. అతని శ్రమకు తగ్గ ప్రతిఫలం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మరోసారి లభించింది.

గతేడాది పంజాబ్ కింగ్స్‌పై గెలిస్తే ఈసారి గుజరాత్ టైటాన్స్‌ను ఓడించారు. సొంత మైదానం కాకపోయినా ఆర్‌సీబీకి ఎలాంటి సమస్యా కాలేదు. గత ఏడాది పీబీకేఎస్ (PBKS) పై అద్భుత విజయం సాధించిన తర్వాత, ఈసారి గుజరాత్ హోమ్ గ్రౌండ్‌లోనే ఆ జట్టును ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఏకపక్ష ఫైనల్స్‌లో ఒకటిగా నిలిచిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ చిత్తు చేసింది. ఈ వరుస టైటిల్స్ ప్రయాణంలో పటిదార్ కీలక పాత్ర పోషించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో తమ టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న (నిలబెట్టుకున్న) మూడో కెప్టెన్‌గా పటిదార్ నిలిచాడు. ఈ జాబితాలో అతని కంటే ముందు కేవలం ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ మాత్రమే ఉన్నారు. ధోని నేతృత్వంలోని సీఎస్‌కే 2010, 2011లో ఈ ఘనత సాధించగా.. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 2019, 2020లో దీనిని సాధించింది. ఇప్పుడు పటిదార్ సారథ్యంలో ఆర్‌సీబీ 2025, 2026లో ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఐపీఎల్, భారత క్రికెట్ దిగ్గజాలైన ధోని, రోహిత్‌ల సరసన పటిదార్ చేరినప్పటికీ.. వారిద్దరికీ కూడా సాధ్యం కాని ఒక సరికొత్త రికార్డును అతను సృష్టించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి రెండు సీజన్లలోనే వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లను గెలవడం పటిదార్‌కు మాత్రమే సాధ్యమైంది. 2025లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పటిదార్, అదే ఏడాది జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి టైటిల్‌ను అందించాడు. ఆ తర్వాత 2026లో కూడా జట్టును సమర్థవంతంగా నడిపించి టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.

దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని 2008లో కెప్టెన్ అయినప్పటి తన మొదటి ఐపీఎల్ టైటిల్ గెలవడానికి మూడు సీజన్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఇక రోహిత్ శర్మ 2013 సీజన్ మధ్యలో రికీ పాంటింగ్ నుండి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి, తన మొదటి సీజన్లలోనే టైటిల్ గెలిచినప్పటికీ.. అతని తదుపరి టైటిల్ 2015లోనే వచ్చింది.

Also Read:సూర్యవంశీపై సచిన్ ప్రశంసలు

కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి రెండు సీజన్లలోనే జట్టును వరుసగా రెండుసార్లు ఫైనల్స్‌కు చేర్చిన రెండో కెప్టెన్‌గా పటిదార్ నిలిచాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా మాత్రమే ఈ ఘనత సాధించాడు. కానీ హార్దిక్ పాండ్యా 2023 ఫైనల్లో చివరి ఓవర్ ఉత్కంఠ పోరులో సీఎస్‌కే చేతిలో ఓడిపోవడంతో వరుసగా రెండు టైటిళ్లు గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

- Advertisement -