కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే కొత్త ప్రభుత్వంలో నలుగురు ఉపముఖ్యమంత్రులను నియమించే ప్రతిపాదనపై డి.కె. శివకుమార్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం నలుగురు డిప్యూటీ సీఎంలను నియమించడం శివకుమార్‌కు ఇష్టం లేదు. కర్ణాటక కాంగ్రెస్‌లో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారని కొందరిని మాత్రమే ఎంపిక చేసి మిగిలిన వారిని పక్కన పెడితే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతుందని ఆయన అధిష్ఠానానికి తెలియజేసినట్లు సమాచారం.
సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. జూన్ 1 లేదా జూన్ 3వ తేదీన శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు, సంస్థాగత పునర్వ్యవస్థీకరణపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశం జరగనుంది. కర్ణాటకలో నాయకత్వ మార్పుల నేపథ్యంలో పార్టీ తన తదుపరి శాసనసభా పక్ష నాయకుడిని ఈ సమావేశంలో నిర్ణయించనుంది. సీఎంగా శివకుమార్‌తో పాటు కొద్దిమంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి.
మంత్రివర్గంలో చేరే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఎం బి పాటిల్,జి పరమేశ్వర,కె జె జార్జ్,ప్రియాంక్ ఖర్గే,యతీంద్ర సిద్ధరామయ్య,కె బి గౌడ,లక్ష్మి హెబ్బాల్కర్,బి సురేష్,సంతోష్ లాడ్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ పదవికి సీనియర్ నాయకులు కె.హెచ్. మునియప్ప, హెచ్.కె. పాటిల్ ముందంజలో ఉన్నట్లు సమాచారం.
Also Read:బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..ఈ తప్పులు అస్సలు చేయకండి!

