మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్యాస్ పంపిణీ సంస్థ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) మరియు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ముంబై ప్రజలపై ఇంధన, వంట గ్యాస్ భారం మరింత పడనుంది. సవరించిన ధరల ప్రకారం సీఎన్‌జీ ధర కిలోకు రూ. 2 పెరిగి రిటైల్ ధర రూ. 86 కి చేరింది. ఇళ్లలో వంట కోసం విస్తృతంగా ఉపయోగించే పీఎన్‌జీ ధర స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (SCM) కు 50 పైసలు పెరుగగా ఈ సవరించిన ధరలు నేటి నుండే అమల్లోకి వచ్చాయి.
MGL సీఎన్‌జీ ధరలను పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు మే 14న కూడా కంపెనీ సీఎన్‌జీ ధరను కిలోకు రూ. 2 పెంచింది. తాజా ధరల సవరణ ముంబై, థానే, నవీ ముంబై మరియు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) లోని ఇతర ప్రాంతాలకు వర్తిస్తుంది. వీటితో పాటు కళ్యాణ్, రాయగఢ్, రత్నగిరి, లాతూర్, ఉస్మానాబాద్, చిత్రదుర్గ మరియు దావణగెరె వంటి పలు ఇతర నగరాల్లో కూడా MGL గ్యాస్ సరఫరా చేస్తోంది.
తక్కువ ఖర్చుతో కూడిన ఇంధన ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీపై ఆధారపడే వేలాది మంది ఆటో రిక్షా డ్రైవర్లు, టాక్సీ ఆపరేటర్లు మరియు ప్రైవేట్ వాహన యజమానులపై ఈ ధరల పెంపు ప్రభావం చూపనుంది. ఇంధన ధరలు మళ్లీ పెరగడంతో, నిర్వహణ ఖర్చులు మరింత పెరుగుతాయని, రాబోయే వారాల్లో ప్రయాణ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి రావచ్చని రవాణా రంగ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..ఈ తప్పులు అస్సలు చేయకండి!

