సిద్ధరామయ్య రాజీనామా ఆమోదం

6
- Advertisement -

కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు నాయకత్వ మార్పు ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ముఖ్యమంత్రి పదవికి సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించినట్లు శుక్రవారం నాడు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గురువారం సాయంత్రం బెంగళూరుకు తిరిగి వచ్చిన వెంటనే గవర్నర్ ఈ రాజీనామాను ఆమోదించారు.

మరోవైపు నూతన మంత్రివర్గ ఏర్పాటు… అధికార పంపకాల విధివిధానాలపై చర్చించేందుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నారు. వారు కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైంది. ఆయన జూన్ 1 లేదా జూన్ 3వ తేదీన కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు సూచించాయి.

తన తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న డీకే శివకుమార్‌కు సిద్ధరామయ్య పూర్తి మద్దతు ప్రకటించారు. శివకుమార్‌కు అందరూ సహకరించాలని గురువారం తన కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో సిద్ధరామయ్య కోరారు. కాంగ్రెస్ అధిష్టానం (హైకమాండ్) ఆదేశాల మేరకే తాను పదవి నుంచి తప్పుకున్నానని, తనకు వ్యక్తిగత పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.

Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!

గవర్నర్ బెంగళూరులో లేకపోవడంతో నా రాజీనామా లేఖను లోక్‌భవన్ బంగ్లాలోని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్‌కు గురువారం మధ్యాహ్నమే అందించాను. హైకమాండ్ అడిగిన వెంటనే తప్పుకుంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి నా పదవికి రాజీనామా చేశాను. నాకు సహకరించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ధన్యవాదాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది అని సిద్ధరామయ్య వివరించారు.

- Advertisement -